గిలానీకి పాక్ అత్యుత్తమ పురస్కారం 

కాశ్మీర్ లోయలో వేర్పాటు వాదులు పాకిస్థాన్ అదుపాజ్ఞలతోనే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారని మరోమారు స్పష్టమైనది.  వేర్పాటువాది, కశ్మీర్‌లో యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తూ భారత్ వ్యతిరేక ప్రచారం చేస్తుండే  సయ్యద్ అలీ షా గిలానీని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం నెత్తికెత్తుకుంది.

పాక్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘‘నిషాన్ -ఈ- పాకిస్తాన్’ అవార్డును మంగళవారం ప్రకటించింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి, ఓ సంవత్సరం పూర్తికావడానికి వారం ముందే పాక్ ఈ అవార్డును వేర్పాటువాది గిలానీకి ప్రకటించడం గమనార్హం.

కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం, హింసను ప్రేరేపించిన వారిలో ప్రముఖుడిగా పేరొందిన జిలాని ఉగ్రవాద మార్గాల నుండి నిధులు సమకూర్చుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు.

 కొద్ది రోజుల కిందటే హురియత్‌ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని, సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

అయితే ఆర్టికల్ 370 ని రద్దు చేసినా దానిని ఓ ఎజెండాగా మార్చడంలో గిలానీ విఫలమయ్యారంటూ పాక్ అప్పట్లో ఈయనపై గుర్రుగా ఉంది. కానీ మనసు మార్చుకున్న పాక్ వేర్పాటువాది గిలానీకి ఇప్పుడు పాక్ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది. 

పాకిస్తాన్‌ ఎగువ సభలో  సోమవారం ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అంతే కాకుండా పాకిస్థాన్ లోని ఒక విశ్వవిద్యాలయానికి గిలానీ పేరు పెట్టాలని,  గిలానీ జీవిత చరిత్రను  పాకిస్తాన్‌లోని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కూడా నిర్ణయించారు.

 గిలానీ హురియత్ కాన్ఫరెన్స్ కు రాజీనామా ప్రకటించిన కొద్దీ రోజులకే పాకిస్తాన్ ఈ అవార్డు ప్రకటించడం గమనార్హం. సుమారు 90 ఏళ్ళ వయస్సున్న ఆయన అనారోగ్యంతో రాజీనామా చేసిన్నట్లు చెబుతున్న ఐఎస్ఐ కుట్రలో భాగమని తెలుస్తున్నది.