కార్పొరేట్ల వత్తిడితో కరొనను ఆరోగ్యశ్రీలో చేర్చని కేసీఆర్ 

కరోనా చికిత్స పేరుతో హైదరాబాద్ లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారి వత్తిడులకు లొంగి ఎందరు గగ్గోలు పెడుతున్నా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. పైరుగా వారికి అనుకూలంగా ఇచ్చిన జిఓలనే మార్చివేసింది. 

మరోవంక వారి వత్తిడిలతో కరోనా చికిత్స  చార్జీలు ఆరోగ్య భీమాకు వర్తింపకుండా ప్రభుత్వం చేసింది. ఇప్పుడు నగదు ఛేళించిన వారికి మాత్రమే చికిత్స చేస్తున్నాయి. వారు ఒకొక్క రోగి నుండి రూ 10 లక్షల వరకు వసూలు చేస్తున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. 

పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో  ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్సను చేర్చడంతో తెలంగాణలో కూడా వత్తిడి పెరుగుతున్నా కేసీఆర్ ప్రభుత్వం లెక్క చేయడం లేదు.  ఆరోగ్యశ్రీలో చేర్చితే లక్షల్లో వసూలు చేసుకునే అవకాశం పోతుందని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వంపై వత్తిడి చేసి చేర్చకుండా చేస్తున్నాయని ఆరోగ్య శాఖ అధికారులే చెబుతున్నారు.

పైగా, ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చితే ప్రభుత్వం నుండి బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని కూడా ప్రైవేట్ ఆసుపత్రులు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం  ఆరోగ్యశ్రీ కింద కరోనాచికిత్సకు  రూ.16 వేల నుంచి రూ.2.60 లక్షల  వరకు ఫీజు చెల్లిస్తామంటూ జీవో ఇచ్చింది. తెలంగాణలో ఆ మేరకు ఫీజులు నిర్ణయించినా  చికిత్స చేసేందుకు కార్పొరేట్ హాస్పిటళ్లు సిద్ధంగా లేవు.

మరోవంక మొదట్లో ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులను కరోనా చికిత్సకు అనుమతించే సమయంలో కేసీఆర్ ప్రభుత్వం చార్జీలను నిర్ణయించింది.   అయితే ఈ ఆసుపత్రుల వత్తిడులకు లొంగి తర్వాత ప్రభుత్వం ఆ జిఓనే మార్చివేసింది. వాస్తవానికి ప్రైవేటు,  కార్పొరేట్హాస్పిటళ్లలో  ఐసోలేషన్ కు రోజుకు రూ.4వేలు, ఐసీయూలో ఉంటే రోజుకు రూ.7,500, వెంటిలేటర్ పెడితే రూ.9,000 చొప్పున చార్జీ వసూలుచేయాలంటూ మొదట్లో ప్రభుత్వం  జీవో జారీ చేసింది.

ఈ చార్జీలు గిట్టుబాటు కావని.. రేట్లు పెంచాలని హాస్పిటళ్లప్రతినిధులు పలుమార్లుమంత్రి ఈటలతో సమావేశమై ఒత్తిడి చేశారు. అయితే పీపీఈ కిట్లు, ఇతర ప్రొసీజర్లపేరిట అదనపు చార్జీలు వసూలు చేసుకోవడానికి ఆ  జీవోలోనే అవకాశం ఇచ్చారు. ఆ లొసుగులను అడ్డుపెట్టుకుని హాస్పిటళ్లు అడ్డగోలు దోపిడీకి దిగాయి. 

మరోవైపు ఆరోగ్య భీమా  కంపెనీలు ప్రభుత్వం నిర్ధారించిన చార్జీలే  చెల్లిస్తామని ప్రకటించడంతో దానికీ కార్పొరేట్ హాస్పిటళ్లు ఒప్పుకోలేదు. ఆరోగ్య భీమా గల రోగులకు కరోనా చికిత్స చేసేందుకు  నిరాకరించాయి. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులు ఆరోగ్య భీమాకు  వర్తించకుండా చేయాలని, ఎక్కువ వసూలు చేసుకునే అవకాశం ఉండాలని ప్రభుత్వం లోని  పెద్దలపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాయి. చివరికి కరోనా చికిత్సకు  సర్కారు నిర్ధారించిన చార్జీలు ఆరోగ్య భీమా  కింద వర్తించవని పేర్కొంటూ ప్రభుత్వం  ఏకంగా జీవో ఇచ్చింది.