తన ప్రభుత్వానికి ఢోకాలేదన్న యడియూరప్ప

కర్నాటకలో తమ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. స్థిరమైన ప్రభుత్వం కోసం, సుస్థిరమైన అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఆయన కోరారు. 

రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా  ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందా లేదా అన్ని దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనకు శ్రీరామరక్ష అని భరోసా వ్యక్తం చేశారు.  ప్రజలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటాననీ, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ఏకైక లక్ష్యమని యడ్డీ పేర్కొన్నారు. 

‘‘మీ ఆశీర్వాదంతో నా ప్రభుత్వం విజయవంతంగా ఒక ఏడాది పూర్తిచేసుకుంది. అందరి సహకారంతో మిగతా కాలం కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడంతో పాటు రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తా. దీన్ని సాధించేందుకు నా శక్తిమేర నిజాయితీగా పనిచేస్తాను..’’ అని యడ్డీ పేర్కొన్నారు. 

గత సంవత్సర కాలంలో తాను ఏనాడూ విద్వేష రాజకీయాలు చేయలేదనీ చెబుతూ  తనను విమర్శించే వారి కోసం కూడా పనిచేశానని ఆయన తెలిపారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలకు గానూ 25 చోట్ల విజయం సాధించామని గుర్తు చేశారు. అట్లాగే డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా 15 స్థానాలకు గానూ 12 చోట్ల జయకేతనం ఎగరేశామని యడ్డీ చెప్పారు. 

 ఇది తన ప్రభుత్వంలో చేసిన పనికి ప్రజల నుంచి దక్కిన గుర్తింపు అని ఆయన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది జూలై 26న జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన మూడురోజుల తర్వాత యడియూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు.