చైనా వ్యతిరేక కూటమిలో భారత్ చేరాలి 

చైనాను విశ్వసించే పరిస్థితులే లేవని అంటూ చైనాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్, కొరియా, వియత్నాం వంటి దేశాలతో కలసి ఒక కూటమిగా భారత్ చేరాలని భారత్ నాయకత్వానికి గిల్గిట్ బాల్తిస్తాన్ నేషనల్ కాంగ్రెస్ డైరెక్టర్ సెంజీ హస్నాన్ షేరింగ్ సూచించారు. 
 
చైనా వైరస్ తో చైనాకు వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పడే అవకాశం కలుగుతున్నదని, ప్రపంచ దేశాలు ఆ దేశపు నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాయని చెప్పారు. తత్త్వా టాక్స్ జరిపిన వెబినార్ లో “చైనా సామ్రాజ్యవాదాన్ని అర్ధం చేసుకోవడం” అంశంపై వాషింగ్ టన్ నుండి మాట్లాడుతూ చైనా సామ్రాజ్యవాదం ఇతర దేశాలకన్నా భిన్నమైనది చెప్పుకొచ్చారు. 
 
చైనా సైబీరియా, మంగోలియా, టిబెట్ వంటి దేశాల భాగాలను విలీనం చేసుకొని, అక్కడ స్థానిక భాష, సంస్కృతి, ఆచారాలు ఏవీ లేకుండా చేస్తున్నదని గుర్తు చేశారు. తనను ఒక ఆక్రమణదారునిగా కాకుండా ఆ భూభాగాలపై సహజమైన హక్కు ఉన్నట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. 
 
ఆ భూభాగాలతో ఎటువంటి సాంస్కృతిక, నాగరిక పరమైన సంబంధం లేకపోయినా కేవలం సైనిక ఆధిపత్యంతో ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. రష్యా కూడా కమ్యూనిస్ట్ దేశమైనప్పటికీ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు భిన్నమైన  ఆర్ధిక, రాజకీయ విధానాలతో వారితో ఎటువంటి పొత్తు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించేదని గుర్తు చేశారు.
 
కానీ చైనా పశ్చిమ దేశాలతో కలసి పనిచేస్తామనే అభిప్రాయం కలిగిస్తూ ప్రదర్శిస్తున్న ఆధిపత్య ధోరణులు నేటి చైనా వైరస్ తో బహిర్గతమవుతున్నట్లు వెల్లడించారు. కలసి ఉమ్మడిగా అభివృద్ధి సాధిస్తామంటూనే అవతలి దేశాలను చిన్నాభిన్నం చేసే ప్రయత్నాలు చేస్తుందని హెచ్చరించారు. 
 
పాకిస్థాన్, నేపాల్ లతో ప్రస్తుతం చైనా జరుపుతున్న స్నేహాన్ని ప్రస్తావిస్తూ ఆ ముందుగా ఆ దేశాలలో ప్రజాస్వామ్యం వికసించే ప్రయత్నాలను వమ్ము చేసి, నిరంకుశ పాలనలకు దోహదపడుతూ ఆ దేశంలోని సామజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలలో తమ ఆధిపత్యం చొచ్చుకు పోయే విధంగా చేస్తున్నారని షేరింగ్ వివరించారు.
 
రాజరికాన్ని కాలదన్ని పూర్తి ప్రజాస్వామ్యం వైపు పోతున్న నేపాల్ లో నేడు కమ్యూనిస్ట్ పాలన వచ్చేటట్లు చేసారని గుర్తు చేశారు. నేపాల్, పాకిస్థాన్ భూభాగాలను చైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ గిల్గిట్గ బాల్తిస్తాన్ లోని ఉత్తర ప్రాంతాలను పాకిస్థాన్ నుండి తీసుకున్నట్లు గుర్తు చేశారు. 
 
అయితే ఆ దేశాల ప్రభుత్వాల నుండి వ్యతిరేకత లేకుండా భూభాగాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొంటుందని చెప్పుకొచ్చారు. చైనా ఏ దేశంలోకి వెడుతుందో అక్కడున్న వ్యవస్థలను ధ్వసం చేస్తుందని, నమూనాలను నిర్వీర్య పరుస్తుందని, నిరంకుశ ధోరణులను ప్రోత్సహిస్తోందని, మైనారిటీలను అణగద్రొక్కే విధంగా చేస్తుందని తెలిపారు. 
 
పాకిస్థాన్, ఇరాన్ లతో చైనా చేతులు కలపడాన్ని ప్రస్తావిస్తూ ఇస్లామిక్ సామ్రాజ్యవాదం, చైనా సామ్రాజ్యవాదం కలసి భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 
 
నేడు గిల్గిట్ బాల్తిస్తాన్ లో పాకిస్థాన్ అండతో చైనా ఒక పెద్ద ఆనకట్ట నిర్మించడాన్ని ప్రస్తావిస్తూ అత్యంత సారవంతమైన భూములు  ముంపుకు గురవుతున్నాయని తెలిపారు. తమను అస్తిత్వం కోల్పోయే విధంగా చేయడం కోసం చేస్తున్నారని షేరింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
తమ భూభాగం వాస్తవానికి భారత్ కు చెందినదే అని అంటూ తాము తిరిగి భారత్ లో విలీనం కావాలని, లడఖ్ లో భాగమై ఒక రాష్ట్రం గా ఏర్పాటు కావాలని చూస్తున్నామని స్పష్టం చేశారు. “మా పై ఇప్పుడు  జరుగుతున్న దాడి తమపై జరుగుతున్న దాడిగా భారత్ గుర్తించాలి” అని హితవు చెప్పారు.