ఫ్రాన్స్ నుండి బైలదేరిన రాఫెల్ జెట్లు 

ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్లు ప్రాన్స్ నుంచి భారత్ కు  ఈ రోజు బయలుదేరాయి. భారత్  36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి 2016లో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. వాటి విలువ రూ. 59 వేల కోట్లు. 

ఆ విమానాలకు సంబంధించి 5 రాఫెల్ జెట్స్ ఈ రోజు ఫ్రాన్స్ నుంచి బయలుదేరాయి. అవి జూలై 29 బుధవారం భారత్ కు చేరుకుంటాయి. ఆ ఫైటర్ జెట్లను హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత వైమానిక దళంలో చేర్చుతారు. ఫ్రెంచ్ విమానయాన సంస్థ అయిన డసాల్ట్ నిర్మించిన ఈ ఫైటర్ జెట్‌లు ఈ రోజు దక్షిణ ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్‌లోని మెరిగ్నాక్ ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరాయి. 

ఈ విమానాలకు స్వాగతం పలకడానికి భారత వైమానిక దళం అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేసింది. వీటిని నడపడం కోసంభారత్ కు చెందిన 12 మంది పైలట్లు, ఇంజనీరింగ్ సిబ్బంది ఈ రాఫెల్ ఫైటర్ జెట్లపై శిక్షణ పొందారు. ఫ్రాన్స్ నుంచి భారత్ కు  మధ్య గల 7000 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఈ విమానాలు యూఏఈలో ఒకసారి మాత్రమే ఆగుతాయి. అంతేకాకుండా ఇంధనాన్ని కూడా గాలిలోనే నింపుకుంటాయి.

‘ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం పది రాఫెల్ విమానాల డెలివరీ పూర్తయింది. ఐదు రాఫెల్ జెట్లు భారత్ కు  బయలుదేరాయి. మరో ఐదు రాఫెల్ జెట్లు పైలట్ల శిక్షణ కోసం ఫ్రాన్స్‌లోనే ఉంటాయి. అనుకున్నట్లుగానే మొత్తం 36 విమానాల డెలివరీ 2021 చివరి నాటికి పూర్తవుతుంది’ అని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 

రాఫెల్ జెట్లు ఫ్రాన్స్ నుంచి బయలుదేరే ముందు ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రాఫ్ భారత పైలట్లతో మాట్లాడారు. రాఫెల్ జెట్లను భారత్ కు  తీసుకువస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత ప్రభావవంతమైన ఆయుధాలను మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణుల వంటి వాటిని కూడా మోయగలవు. రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు  సరిపడే నిర్దిష్ట మార్పులతో తయారయ్యాయి. వాటిలో ఇజ్రాయెల్ హెల్మెట్-మౌంటెడ్ డిస్‌ప్లేలు, రాడార్ హెచ్చరిక రిసీవర్లు, లో-బ్యాండ్ జామర్స్, 10 గంటల ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఇన్‌ఫ్రా-రెడ్ సెర్చ్ మరియు ట్రాకింగ్ సిస్టమ్‌లతో పాటు పలు సాంకేతిక వ్యవస్థలతో రూపుదిద్దుకున్నాయి.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత నెలలో ఫ్రెంచ్ అధికారులతో టెలిఫోనిక్ సంభాషణ నిర్వహించారు. అప్పుడు ఫ్రెంచ్ అధికారులు షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ బ్యాచ్ విమానాల డెలివరీ జరుగుతుందని హామీ ఇచ్చారు. కరోనావైరస్ కారణంగా డెలివరీ ఆలస్యం చేయమని వారు తెలిపారు.