అవుతు శ్రీహరి
గత 21 సంవత్సరాలుగా ఏటా జులై 26న కార్గిల్ విజయ దినోత్సవం జరుపుకొంటున్నాము. దేశ సైనిక చరిత్రలో మైలురాయి వంటి ఘట్టాలను గుర్తుచేసుకొనే సందర్భాలలో, దేశ రక్షణ కోసం పోరాడి అసువులుబాసిన అమర జవాన్లకు కృతజ్ఞతా పూర్వకంగా శ్రద్ధంజలి ఘటించటం, యుద్ధ వీరులను వందనాపూర్వకంగా స్మరించుకోవటంతో పాటు, యుద్ధం నేర్పిన పాఠాలను మళ్ళీ గుర్తుచేసుకొని వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఆయా పాఠాల ఔచిత్యాన్ని గుర్తెరిగి మరింత భద్రతాయుతమైన భవిష్యత్తు కొరకు ప్రయత్నించటం సముచితంగా ఉంటుంది.
ఓకే ఒక్క ఓటు తేడాతో లోక్ సభలో ప్రభుత్వం పతనం కావటంతో వాజపేయి నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారంలో ఉండి, మధ్యంతర ఎన్నికలు జరగవలసి ఉన్న తరుణంలో కార్గిల్ యుద్ధం సంభవించింది. భారత పాకిస్థాన్లు అధికారికంగా అణ్వస్త్ర దేశాలుగా పరిణమించిన సంవత్సరం గడవకముందే కార్గిల్ యుద్ధం మొదలయింది. శాంతి సందేశంతో అప్పటి భారత ప్రధాని వాజపేయి చారిత్రాత్మక లాహోర్ బస్సు యాత్ర జరిపి నెలలు గడవకముందే పాకిస్తాన్ భారత్ ను వెన్నుపోటుపొడిచింది.
సరిహద్దుల వెంబటి ఉన్న ఫార్వర్డ్ పోస్టులను శీతాకాల సమయంలో ఖాళీ చేసి మళ్ళీ వేసవికాలం సమీపించగానే తిరిగి వాటిలోకి వెళ్ళటం 1999 వరకు భారత సైన్యానికి ఆనవాయితీగా ఉండేది. అటువైపు ఉన్న పాకిస్తాన్ సైన్యం సైతం అలాగే చేస్తుండేది. కానీ 1999లో ఈ ఆనవాయితీని అదనుగా తీసుకోని పాకిస్తాన్ సైన్యం వాస్తవాధీన రేఖ దాటి నిర్జన ప్రాంతంలోని అనేక పర్వత శ్రేణులను ఆక్రమించుకొని పర్వత శిఖరాలపై తిష్టవేసింది.
యుద్ధం పూర్తి స్థాయి యుద్ధంగా మారితే అణు యుద్ధంగా కూడా మారవచ్చేమోనన్న సంశయంతో అలా జరగకుండా ఉండేందుకు గాను సరిహద్దులను మాత్రం దాటవద్దని భారత సైన్యానికి వాజపేయి ప్రభుత్వం దిశా నిర్దేశం చేసింది. ఆ కారణంగా యుద్ధ తంత్రాల విషయంలో సంక్లిష్టమైన పరిమితులకు లోబడి వాస్తవాధీన రేఖకు మన వైపునే భారత సైన్యం యుద్ధం చేయవలసి వచ్చింది.
ఏ మాత్రం నివాసయోగ్యం కానీ తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులలో, కఠినతరమైన పర్వత ప్రాంతాలలో, పర్వత శిఖరాలపైన అనువైన ప్రదేశంలో ఉన్న శత్రువుపై పోరాటం చేస్తూ క్రిందనుంచి నిటారుగా ఉన్న పర్వత శిఖరాల వైపు ముందుకు సాగవలసి వచ్చినప్పటికీ, భారత సైన్యం సంకల్ప బలం, కృత నిశ్చయం, త్యాగాలకు వెరవని అసమాన ధైర్య సాహసాల కారణంగా కార్గిల్ పరిమిత యుద్ధంలో భారత్ విజయం చేజిక్కించుకోగల్గింది. కానీ ఈ విజయంకోసం భారత సైనికుల ప్రాణాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.
కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్న వేలాది సైనికులలో 527మంది అమరులై జాతీయ పతాకం చేత కప్పబడి తిరిగి రాగా, 1,363 మంది క్షతగాత్రులయ్యారు. మెరుగైన నిఘా, పర్యవేక్షణ వ్యవస్థ, మరింత అధునాతన ఆయుధాలు, పరికరాలు కలిగి మెరుగైన యుద్ధ సన్నద్ధతతో ఉన్నట్లయితే బహుశా ఈ మరణాలను తగ్గించుకొనే అవకాశం ఉండేది. సమర్ధవంతంగా దేశ భద్రతను సంరక్షించుకొనేందుకు గాను కార్గిల్ యుద్ధం నేర్పిన పాఠాలను నెమరువేసుకోవటం అవసరం.
కార్గిల్ లో పాక్ సైన్యం చొరబాట్లకు పాల్పడటమే కాకుండా చొరబాటుదారులు పర్వత శిఖరాలను, భారత భూభాగాలను ఆక్రమించుకోవటంతో భారత సైన్యం పూర్తి ఆశ్చర్యానికి గురైంది. ఈ సంఘటన మొదటి సమాచారం ఓ పశువుల కాపరినుండి లభించినప్పటికీ, ఈ చొరబాటు దారులు ఏయే ప్రాంతాలలో ఎంత లోతుగా వచ్చారన్న విషయం అంచనా వేయటానికి భారత సైన్యానికి సుమారు మూడు వరాల సమయం పట్టింది. కుతంత్రాల పాకిస్తాన్ మాకేం సంబంధంలేదు, ఇది ముజాహిదీన్ల చర్య అని బుకాయించింది.
అయితే అప్పటి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పేర్వేజ్ ముషారఫ్ చైనా పర్యటనలో ఉండి బీజింగ్ నుండి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అఫ్ స్టాఫ్ జనరల్ అజీజ్, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ లతో మాట్లాడిన ఫోను సంభాషనలను భారత బాహ్య నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’ రికార్డు చేయగా వాటిని ప్రభుత్వం మీడియా కు విడుదల చేసి పాకిస్తాన్ గుట్టురట్టు చేసింది.
యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లో భారత సైన్యం అనేక ఎదురు దెబ్బలను ప్రాణ నష్టాన్ని చవిచూసింది. పెక్కు సందర్భాలలో శత్రువు భారత సైనికులపై ఎక్కడనుండి కాల్పులు జరుపుతున్నాడో తెలియకుండా దాడి చేయగలిగాడు. కొన్ని సందర్భాలలో భారత సైనికుల కదలికలను శత్రువు స్పష్టంగా వీక్షించగలిగాడు. శ్రీనగర్, లే పట్టణాలను కలుపుతున్న జాతీయ రహదారి సైతం శత్రువు కాల్పులకు గురైంది. శత్రువు దృష్టిలో పడకుండా ఉండేందుకు గాను భారత సైనిక వాహనాలు రాత్రి సమయంలో లైట్లు లేకుండా ఆ రహదారి మీద ప్రయాణం చేయవలసి వచ్చింది.
యుద్ధం తీవ్ర రూపం దాల్చకుండా నివారించే ఉద్దేశంతో వైమానిక దళ వినియోగానికి కాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మొదట్లో విముఖత కనపరచినప్పటికీ, తరువాత భారత వాయుసేనకు యుద్ధంలో దిగటానికి అనుమతి లభించింది. భారత సైన్యం ప్రారంభించిన ‘ఆపరేషన్ విజయ్’ కు మద్దతుగా భారత వాయు సేన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ చేపట్టింది.
భారత నావికా దళం సైతం పాకిస్తాన్ కు ప్రతిబంధకంగా యుద్ధ నౌకలను మోహరించటం ద్వారా ‘ఆపరేషన్ తల్వార్’ అమలుచేసింది. భారత వాయు సేన యుద్ధంలోకి దిగిన మొదటి మూడు రోజుల్లోనే ఓ మిగ్-21, ఓ మిగ్-27 యుద్ధ విమానాలను, ఓ హెలికాప్టర్ ను కోల్పోయింది. తరువాతి కాలంలో భారత యుద్ధ విమానాలు శత్రువు వాడుతున్న స్ట్రింగర్ మిస్సైల్ కు అందనంత ఎత్తులో ఎగురుతూ దాడులు చేసాయి.
సంక్లిష్ట సమయంలో లేసర్ గైడెడ్ బాంబులను సత్వరం సరఫరా చేయటమే కాకుండా వాటిని మిరాజ్-2000 యుద్ద విమానాలతో అమర్చుకొనే సాంకేతిక సహకారం సైతం అందించి ఇజ్రాయెల్ భారత్ కు బాసటగా నిలిచింది. మిరాజ్-2000 యుద్ధ విమానాలు గురిచూసి వేసిన లేసర్ బాంబులు శత్రువుల బంకర్లను పెకలించటమే కాకుండా శత్రువు మనో ధైర్యాన్ని దెబ్బ తీశాయి.
అత్యంత భీకర సమరంలో భారత సైన్యం టోలోలింగ్ పర్వత శ్రేణిని 13 జూన్ 1999 న కైవసం చేసుకోవటంతో యుద్దవాతావరణం క్రమంగా భారత్ కు అనుకూలంగా మారింది. వీరోచితంగా పోరాడుతూ ఒక్కో పర్వత శ్రేణిని కైవసం చేసుకుంటూ భారత సైన్యం ముందుకు సాగగా కొద్ది వారాల్లోనే శత్రువు పలాయన మంత్రం జపించాడు. చివరగా 26 జులై 1999 న చొరబాటు దారులందరినీ భారత భూభాగంలోనుంచి పూర్తిగా తరిమివేసినట్లు భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.
యుద్ధం ముగియగానే వాజపేయి ప్రభుత్వం కార్గిల్ లో పాకిస్తాన్ దురాక్రమణకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేసి అటువంటి చొరబాట్లు, ఆక్రమణలు భవిష్యత్తులో జరగకుండా నివారించటానికి తీసుకోవలసిన చర్యలను సూచించేందుకుగాను కార్గిల్ సమీక్షా సంఘాన్ని నియమించింది. ఆ కమిటీ త్వరితగతిన అప్పగించిన పని పూర్తిచేసి డిసెంబర్ 1999 నాటికే తమ అంతిమ నివేదికను రూపొందించింది. కార్గిల్ సమీక్షా సంఘం సూచించిన కొన్ని సిఫార్సులు కార్యరూపం దాల్చగా, కొన్ని సూచనలు నేటికీ అమలుకు నోచుకోలేదు.
కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులలో 75 శాతానికి పైగా శత్రువు శతఘ్ని కాల్పుల కారణంగా అమరులయ్యారు. శతఘ్నులను గుర్తించే రాడార్లు అవసరమంటూ భారత సైన్యం 1994నుండి కోరింది. పాకిస్తాన్ వద్ద ఆ రాడార్లు 1999 కంటే ఎంతో ముందునుంచే ఉన్నాయి. ఆ రాడార్లు వినియోగించటం కారణంగా కొన్ని సందర్భాలలో భారత దళాలు ఎక్కడినుంచి కాల్పులు జరుపుతున్నారో గుర్తించి పాకిస్తాన్ సరిగ్గా అక్కడికే గురిపెట్టి కాల్పులు జరపగలిగింది.
భారత సైన్యానికి పాకిస్తాన్ సైన్యానికి సరఫరా చేసిన వాటికంటే మెరుగైన శతఘ్ని గుర్తింపు రాడార్లను సరఫరా చేయటానికి అమెరికా 1997లోనే అంగీకరించినప్పటికీ ఆ సంభందిత ఫైల్ భారత రక్షణ మంత్రిత్వ శాఖలో అధికారుల నిదర మత్తు కారణంగా పెండింగ్ ఫైళ్లలో ఒకదానిగా నిలచిపోయింది. శతఘ్నులను గుర్తించే ఆ రాడార్లు భారత సైన్యం వద్ద కార్గిల్ యుద్ధ సమయంలో ఉండి ఉన్నట్లయితే భారత్ మరణాలను తగ్గించుకోవటమే కాకుండా శత్రువును మరింతగా దెబ్బతీయగలిగి ఉండేది.
కాస్తంత స్పష్టంగా వీక్షించగలిగే ఉపగ్రహ ఛాయాచిత్రాల సరఫరా పొందేందుకు గాను భారత్ రష్యాతో 1999కి ముందే ఓ ఒప్పందం చేసుకుంది. భారత్ చెల్లింపులు చేయని కారణంగా ఆ ఛాయాచిత్రాల సరఫరా మొదలుకాలేదు. 1999లో కార్గిల్ యుద్ధం ప్రారంభం అయినా కొద్ది వరాల తరువాత ఆదరాబాదరాగా భారత్ ఆ చెల్లింపులు చేసిన తరువాతగాని ఆ ఛాయాచిత్రాలను వినియోగించుకోలేకపోయింది.
యుద్ధం జరుగుతున్న సమయంలో మీడియా వాళ్ళు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా అప్పటి భారత సైన్యాధ్యక్షుడు జనరల్ వి.పి. మాలిక్ “మా వద్ద ఏముంటే వాటితోనే యుద్ధం చేస్తాం” అంటూ పేర్కొన్నారు. అందులో ‘అవసరమైన ఆయుధ సంపత్తి, పరికరాలు సరిగా లేనప్పటికీ’ అనే అంతరార్థం స్పష్టంగానే గోచరించింది.
బోఫార్స్ కంపెనీ పై ఉన్న నిషేధాన్ని యుద్ధం జరుగుతున్న సమయంలో అత్యవసరంగా స్పేర్ పార్ట్ లు దిగుమతి చేసుకొనేందుకు గాను ఉపసంహరించుకోవాల్సివచ్చింది. కార్గిల్ యుద్ధ సమయంలో మందుగుండు సామాగ్రి నిలువలు, అవసరమైన రక్షణ రంగ పరికరాలు భారత సైన్యం వద్ద క్షీణ దశలో ఉండి, అత్యవసర కొనుగోళ్ల కోసం భారత్ పరుగులు తీయవలసి రావటం దురదృష్టకరం.
ఆధునిక యుద్ధ సవాళ్ళను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం అవసరమని కార్గిల్ యుద్ధ అనుభవం నొక్కి చెపుతోంది. చీఫ్ అఫ్ డిఫెన్సె స్టాఫ్ నియామకం అవసరమని కార్గిల్ సమీక్షా సంఘం 1999లో సిఫార్సు చేసినా, ఇరవై సంవత్సరాల తరువాతగానీ ఆ నియామకం అమలులోకి రాలేదు. త్రివిధ దళాలను అనుసంధానించి ఉమ్మడి యుద్ధ బలగాలను ఏర్పరిచే విషయంలో, రక్షణ మంత్రిత్వ శాఖకు సైనిక దళాల మధ్య దూరాన్ని తొలగించే విషయంలో ఎన్నో సూచనలు కార్యరూపం దాల్చవలసి ఉంది.
ఓ ‘జాతీయ భద్రతా సిద్దాంతా’న్ని రూపొందించాలని కార్గిల్ సమీక్షా సంఘం సూచించింది. సైనిక బలగాల సంస్కరణలను సూచించేందుకు ఏర్పరచిన షెకాత్కర్ కమిటీ కూడా 2017లో ఇదే సూచనను పునరుద్ఘాటించింది. ఈ సూచన ఇప్పటికీ ఇంకా అమలు కావలసి ఉంది. భద్రతా సిద్దాంతం స్పష్టంగా ఉంటే తదనుగుణంగా సైనిక, రక్షణ వ్యూహ రచనలు, బలగాల ఏర్పాటు చేసుకొనే వీలుంటుంది.
చైనా పాకిస్థాన్ల మధ్య నానాటికీ పెంపొందుతున్న గాఢ బాంధవ్యం, భారత్ పట్ల పాకిస్తాన్ కొనసాగిస్తున్న మొండి శత్రుత్వ వైఖరి, రోజు రోజుకూ పెరుగుతున్న చైనా దుందుడుకు, ఆక్రమణ స్వభావం భారత్ ఎదుర్కొంటున్న కారణంగా, రక్షణ సంసిద్ధత విషయంలో ఏ మాత్రం రాజీ లేకుండా ఎల్లవేళలా జాగరూకతతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
(వ్యాసకర్త న్యాయవాది, ‘సోషల్ కాజ్’ సంఘటనా కార్యదర్శి, రక్షణ రంగ నిపుణులు.)
More Stories
6 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా
ప్రధాన మంత్రి పదవి అంటే తిరస్కరించా!