కార్గిల్‌ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదాం  

కార్గిల్‌ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదాం  

కార్గిల్‌ స్ఫూర్తితో కరోనాపై పోరాడుదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని ఆయన హెచ్చరించారు. మొదట్లో కంటే కరోనా వైరస్ ఇప్పుడు మరింత ప్రమాదకారిగా మారిందని స్పష్టం చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి మన్‌ కీ బాత్‌లో ప్రసంగించిన మోదీ.. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. 

 వైరస్ విజృంభించకుండా ఉండేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని ప్రకటించారు. కరోనా వైరస్‌పై పోరాటానికి మరింత సమర్థత అవసరమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో కరోనాను తరిమిగొడదామని పిలుపిచ్చారు. 

ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. కరోనా రికవరీ రేటులో ఇతర దేశాల కంటే చాలా మెరుగ్గా ఉన్నామని మోదీ తెలిపారు. కరోనా నుంచి దేవం విముక్తి పొందాలని, ఆత్మ నిర్భర భారత్ కోసం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలు కోరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

కార్గిల్‌ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు, వారికి జన్మనిచ్చిన తల్లులకు దేశ ప్రజలందరి తరపున వందనం సమర్పిస్తున్నానని చెబుతూ కార్గిల్‌ యుద్ధంలో భారత సైనికులు చూపిన పరాక్రమాన్ని యావత్‌ ప్రపంచ చూసిందని గుర్తు చేశారు. ఆ యుద్ధంలో సైనికులు చూపి త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

దేశాన్ని స్థిరంగా రక్షించిన సాయుధ దళాల ధైర్యం, సంకల్పం మరువలేమని చెబుతూ సైనికుల శౌర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. దేశ సమగ్రతకు సైనికులు చూపే ధైర్య సాహసాలకు వందనం చేశారు. 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన సైన్యం కార్గిల్‌ యుద్ధంలో గెలిచింది అని మోదీ గుర్తు చేశారు.

సైనికుల త్యాగాలను యువత విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. సైనికుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలని మోదీ సూచించారు.  భారత్‌ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే  అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు ఆనాడు పాక్‌ దురాలోచన చేసిందని ధ్వజమెత్తారు.

కుట్రపూరితంగా భారతదేశ భూభాగాన్ని ఆక్రమించాలనే దుస్సాహసం పాకిస్తాన్‌ చేసిందని మోదీ తెలిపారు. తమకు మేలు చేసే వారికి కూడా అకారణంగా కీడు చేసేందుకు ఆలోచిస్తూ ఉండడమే దుష్టుల స్వభావమని ప్రధాని దుయ్యబట్టారు.