
కేరళ, కర్ణాటకలో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ‘అల్‌ఖైదా ఇన్ ద ఇండియన్ సబ్‌కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) ఉగ్రసంస్థ భారత ఉపఖండంలో దాడులకు కుట్రపన్నుతున్నట్లు తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని నిమ్రుజ్, హెల్మండ్, కాందహార్ రాష్ర్టాలలో తాలిబన్ నీడన ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నదని వెల్లడించింది.
ఇందులో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్‌కు చెందిన 150-200 మంది సభ్యులుగా ఉన్నారని, ఒసామా మసూద్ ప్రస్తు తం దీనికి అధిపతిగా ఉన్నాడని పేర్కొంది. తమ మాజీ అధిపతి ఆసిం ఉమర్ మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించింది. ఐఎస్‌ఐఎస్, అల్‌ఖైదా, వాటి అనుబంధ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షల అమలు పర్యవేక్షణ కమిటీ తాజాగా తన నివేదికను విడుదల చేసింది.
ఐఎస్‌కు చెందిన భారత శాఖలో దాదాపు 180 నుంచి 200 మంది సభ్యులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కేరళ, కర్ణాటకలో గణనీయ సంఖ్యలో ముష్కరులు ఉన్నట్టు తెలిపింది. ఆప్ఘనిస్థాన్‌లో దాదాపు 6500 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు తిష్ఠవేసినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. వీరిలో అత్యధికమంది తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రసంస్థకు చెందినవారేనని తెలిపింది.
దీని వల్ల రెండు దేశాలకూ ముప్పు ఉన్నదని హెచ్చరించింది. ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం అతిపెద్ద ఉగ్రసంస్థగా ఉన్న టీటీపీ పాకిస్థాన్‌లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిందని తెలిపింది. పలువురు మాజీ టీటీపీ సభ్యులు ఐఎస్‌ఐఎల్-కే (ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ లెవంట్-ఖొరసన్)లో చేరినట్లు పేర్కొంది.
పాక్‌ను ఎందుకు అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా పరిగణిస్తారో ఆ దేశం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ పేర్కొన్న కొన్నిరోజులకే ఈ నివేదిక విడుదలైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యలు చేపట్టేలా పాక్‌పై ఒత్తిడి తేవాలని ప్రపంచదేశాలను భారత్ కోరింది. తమ దేశంలో దాదాపు 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు స్వయంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ గతేడాది జూన్‌లో అంగీకరించిన సంగతి తెలిసిందే.
More Stories
గాయని నేహా రాథోడ్‌పై దేశద్రోహం కేసు
పాతబస్తీలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ సోదాలు
దశాబ్దం తర్వాత లెఫ్ట్ కంచుకోట జె ఎన్ యు లో ఎబివిపి పాగా!