కరోనాకు వ్యతిరేకంగా దేశ ప్రజానీకం సహజసిద్ధంగా రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్నట్లు, సామూహిక రోగనిరోధక శక్తి దేశంలో మొదలైన్నట్లు తాజాగా వెలువడుతున్న పరిశోధనల ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. దేశంలోని 18 కోట్ల మందిలో ఇప్పటికే కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతినిరోధకాలు (యాంటీబాడీలు) అభివృద్ధి చెందినట్టు ముంబైకి చెందిన థైరోకేర్ అనే ప్రైవేటు ల్యాబ్ వెల్లడించింది.
20 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా 600 వేర్వేరు ప్రాంతాల నుంచి 60 వేల మందికి సంబంధించిన యాంటీబాడీల టెస్టుల ఫలితాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చామని సంస్థ పేర్కొంది. దేశంలో దాదాపు 15 శాతం జనాభాలో (18 కోట్ల మందిలో) ఇప్పటికే యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయన్నది. తమ అంచనాలు మూడు శాతం అటుఇటుగా ఉండవచ్చని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ వేలుమణి పేర్కొన్నారు.
‘దీన్నిబట్టి వైరస్‌బారిన పడ్డ ప్రతి పదివేల మందిలో ఒక్కరే మరణిస్తున్నారు. ఇది సానుకూల పరిణామం’ అని ఆయన పేర్కొన్నారు. మరోవంక, దేశ రాజధాని ఢిల్లీ జనాభాలో 23.48 శాతం (44.61 లక్షల) మందిలో కరోనా వైరస్ యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు ఢిల్లీ ప్రభుత్వం, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే.
థైరోకేర్ పరిశోధన దీనిని ధ్రువీకరించే విధంగానే కాకుండా దేశంలోని 600 ప్రాంతాల్లోనూ ఈ పరిణామం చోటుచేసుకుంటున్నట్లు వెల్లడించింది. వాళ్లు పరిమితస్థాయిలో చేపట్టిన పరిశోధనతోనే 18 కోట్ల మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారంటే ఇక దేశమంతటా భారీస్థాయిలో వ్యక్తుల్లో యాంటీబాడీల గురించి పరిశోధిస్తే.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్ని కోట్లమంది శరీరాల్లో యాంటీబాడీలు ఉండటం వల్ల వారి ద్వారా వైరస్ వ్యాపించదని, అంటే వారు కరోనా వాహకులుగా ఉండబోరని, దీనివల్ల దేశంలో మహమ్మారి ఉద్ధృతి క్రమంగా తగ్గుతుందని నిపుణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భారత్ లేచి నిల్చుందని, వైరస్‌పై కదనశంఖాన్ని పూరించిందని చెబుతున్నారు.
ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఇక వైరస్‌కు అడ్డుకట్ట వేయటం ఆచరణసాధ్యమేనని భావిస్తున్నారు. త్వరలోనే వైరస్ కేసులు గరిష్ఠ స్థాయికి (పీక్ స్టేజికి) చేరుకొని ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.దేశ జనాభాలో 70 శాతం మంది వైరస్ ప్రభావానికి గురై సొంతంగా రోగనిరోధక వ్యవస్థను పెంపొందించుకొని మహమ్మారి నుంచి బయటపడే ప్రకియను ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అంటారు.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం