మావోయిస్టు అగ్రనేత, ఆర్కే గా పేరొందిన అక్కిరాజు హరగోపాల్ మరోసారి పోలీస్ కాల్పులలో తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో త్రుటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. ఆలస్యంగా అందిన సమాచారం మేరకు ఈ నెల 19వ తేదీన విశాఖ ఏజెన్సీలోని పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల నుండి మావోయిస్టు అగ్రనేత ఆర్‌కే తప్పించుకోగా, మరో అగ్రనేత చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పట్టుకోవడానికి గత నాలుగు రోజులుగా ఇటు ఏపీ, అటు ఒడిశా పోలీసు బలగాలు ఏవోబీని జల్లెడ పడుతున్నాయి.
ఏవోబీ ప్రాంతంలో ఈనెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, స్థానిక కీలక మిలీషియా సభ్యులతో విశాఖ ఏజెన్సీకి అనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా బెజ్జంగి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారని ఈనెల 14న పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
ఒడిశా పోలీసులు వెంటనే అప్రమత్తమై మరోసటి రోజు కూంబింగ్‌కు దిగారు. 16 తేదీన ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కనిపించడంతో కాల్పులు ప్రారంభించారు. మావోలు కూడా ఎదురు కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు.
ఆ ప్రాంతానికి పక్కనే వున్న విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బుసిపుట్టు అటవీ ప్రాంతం, పెదబయలు మండలం జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల మీదుగా వారు ఇంజెరి అటవీ ప్రాంతానికి వెళుతున్నట్టు విశాఖ జిల్లా పోలీసులకు సమాచారం వచ్చింది.
దీంతో 18 వ తేదీ నుంచి ప్రత్యేక పోలీసు బలగాలతో ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. మూడు బృందాలుగా ఉన్న 30 మంది మావోయిస్టులు ఈ నెల 19న పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ బొంజంగి, లండులు అటవీ ప్రాంతం మీదుగా ఇంజెరి వైపు వెళుతున్నారు.
అప్పటికే లండులు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో వున్న పోలీసు బలగాలు తొలుత ఒక మావోయిస్టు బృందం తమకు కొద్ది దూరంలో వెళ్లడాన్ని గమనించి, వ్యూహాత్మకంగా కాల్పులు జరపలేదు. కొద్ది సేపటి తర్వాత వచ్చిన రెండో బృందంపై పోలీసులు కాల్పులు జరిపారు.
దీంతో మావోయిస్టులు రెండు బృందాలు కాల్పులు జరుపుతూ తప్పించుకుని పారిపోయారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు పలుచోట్ల రక్తపు మరకలు, తుపాకీ, ఇతర సామగ్రి కనిపించాయి. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడిందీ లేనిదీ స్పష్టంగా తెలియరాలేదు.
మూడు రోజుల తరువాత మంగళవారం నాటికి పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించగలిగారు. ఆదివారం పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత, ఏవోబీ కార్యదర్శి చలపతి తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన భార్య అరుణకు సైతం బులెట్‌లు తగిలాయని గుర్తించారు.
మూడో బృందంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్‌కే ఉన్నారని, ముందు వెళుతున్న బృందంపై పోలీసులు కాల్పులు జరపడాన్ని గమనించి చివరి బృందంలో వున్న ఆయన తప్పించుకున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఆదివారం ఎదురు కాల్పులు జరిగిన సమయంలో ఏవోబీలో భారీ వర్షం కురుస్తుండడంతో తదుపరి గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని, లేకపోతే భారీ ఎన్‌కౌంటర్ జరిగేదని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
More Stories
స్కామ్‌లకు అడ్డాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం
అమరావతి పాత టెండర్లు రద్దు
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది