1500 పడకలన్న టీమ్స్ లో 100 కూ సదుపాయాలేవే!

కరోనా రోగులకు చికిత్సకోసం అంటూ తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంను 1500 పడకలతో ఎంతో ఆర్భాటంగా తెలంగాణ ఇంస్టిట్యూట్ట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) గా తీర్చిదిద్ది నెలలు గడుస్తున్నా ఇంకా అక్కడ వైద్య సదుపాయాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకు రాకపోవడం కరోనా కట్టడి పట్ల  బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 
బిజెపి శాసన మండలి పక్ష నాయకులు ఎన్. రామచంద్రరావు నేతృత్వంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యోగానంద్ టీమ్స్ ను సందర్శించి గాంధీ ఆసుపత్రి వలే కరోనా రోగులకు ఇక్కడ పూర్తిస్థాయిలో చికిత్సా సదుపాయాలు కలిగించాలని డిమాండ్ చేశారు.
 
ఎయిమ్స్ తరహాలో టిమ్స్ ను తయారు చేస్తామని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించింది. 1500 పడకల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో కనీసం 100  పడకలకు కావలసిన మౌళిక వసతులు, డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్ కూడా లేరని విస్మయం వ్యక్తం చేసింది. 
 
రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందడమే కాకుండా కనీసం వైద్య సహాయం అందించడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నదని వారు ధ్వజమెత్తారు. ఇప్పుడున్న కరోనా తీవ్ర స్థాయిలో  ఉన్న  దృష్ట్యా కనీసం మరో నాలుగు టిమ్స్ తరహాలో హైదరాబాద్ తో పాటు వివిధ నగరాలలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులకు సంబంధించిన అవసరమైన పడకలు ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్నాయని చెప్తున్నా వారికి కేటాయించడం లోగాని, చేర్చుకోవడం గాని చేయడం లేదని బీజేపీ మండిపడింది. కనీసం 25,000 పడకలు వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని బిజెపి డిమాండ్ చేసింది.