మమతా తిరిగి ప్రమాణం చేసే పరిస్థితుల్లేవు 

మమతా తిరిగి ప్రమాణం చేసే పరిస్థితుల్లేవు 

2021 ఎన్నికల్లో బీజేపీని బెంగాల్‌ నుంచి తరిమి కొడతామన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలను బీజేపీ   తిప్పికోట్టింది. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ తిరిగి ప్రమాణం చేసే పరిస్థితులే లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. 

 ‘‘నేడు నడిచిన సర్కస్‌ను మేము చూశాం. తమ ఉపన్యాసంలో 95 శాతం బీజేపీనే విమర్శించడమే సరిపోయింది. ఆమె బీజేపీని చూసి భయపడుతోందనడానికి ఇదే నిదర్శనం. తృణమూల్‌లోకి ఎవరూ వెళ్లడం లేదు. అందుకే ఇతర పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు” అంటూ ధ్వజమెత్తారు. 

తీవ్ర నిరాశతోనే ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత మమత బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయరని ఘంటాపథంగా చెప్పారు.  సార్వత్రిక ఎన్నికల్లో 42 సీట్లు గెలుస్తామని ఆమె అల్లుడు ప్రకటించారని, కానీ పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని ఘోష్ ఎద్దేవా చేశారు.  

అంతకు ముందు తిరిగి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, 2021 ఎన్నికల్లో బీజేపీని బెంగాల్‌ నుంచి తరిమి కొడతామని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించారు. రాబోయే ఎన్నికలు బెంగాల్‌తో పాటు దేశానికే కొత్త మార్గదర్శకాన్ని చూపించనున్నాయని ఆమె తెలిపారు. 

బీజేపీ పాలనలో దేశమంతా భయం భయంగా ఉందని, ప్రజలు నోరు విప్పడానికే జంకుతున్నారని ఆరోపించారు. తృణమూల్ నిర్వహించిన ‘వర్చువల్ ర్యాలీ’లో ఆమె ప్రసంగిస్తూ తమ ప్రత్యర్థి బీజేపీని సీఎం మమత ‘బెంగాల్‌తో సంబంధం లేని వారు (అవుట్ సైడర్స్) గా అభివర్ణించింది. బెంగాల్‌ను పాలించే అవకాశాన్ని బీజేపీకి ఎప్పటికీ కలిపించమని భరోసా వ్యక్తం చేశారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని 42పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ 18 స్థానాలు కైవసం చేసుకొని అధికార టీఎంసీకి జలక్‌ ఇచ్చింది.