గుజరాత్, లడఖ్ లకు బిజెపి కొత్త అధ్యక్షులు 

గుజరాత్, లడఖ్ లకు బిజెపి కొత్త అధ్యక్షులు 

గుజ‌రాత్ రాష్ట్రానికి, కేంద్ర‌పాలిత ప్రాంతం ల‌ఢ‌ఖ్‌కు బీజేపీ అధిష్ఠానం ఇద్దరు ఎంపిలను కొత్త అధ్యక్షులను నియ‌మించింది. గుజ‌రాత్ బీజేపీ అధ్య‌క్షుడిగా చంద్ర‌కాంత్ ర‌ఘునాథ్ పాటిల్‌ను (సీఆర్ పాటిల్‌ను), లఢ‌ఖ్ బీజేపీ అధ్యక్షునిగా  జ‌మ్యాంగ్ త్సెరింగ్ నంగ్యాల్‌ను నియ‌మిస్తున్న‌ట్లు బీజేపీ ఒక ప్ర‌క‌న‌ట‌లో వెల్ల‌డించింది. 

ఇప్ప‌టివ‌ర‌కు గుజ‌రాత్ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న జితేంద్ర‌భాయ్ వాఘానీ స్థానంలో సీఆర్ పాటిల్‌ను నియ‌మించారు. 65 ఏండ్ల సీఆర్ పాటిల్ వ‌రుస‌గా మూడు సార్లు న‌వ్‌సారీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. గ‌త రెండు ప‌ర్యాయాలు 5 ల‌క్ష‌ల‌కుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

సీఆర్ పాటిల్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. అంతేగాక ఎక్కువ‌గా ఆయ‌న‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటార‌న్న పేరుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ అధిష్ఠానం ఆయ‌న‌కు గుజ‌రాత్ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది.

ఇక జ‌మ్యాంగ్ త్సెరింగ్ నంగ్యాల్‌కు 35 ఏండ్ల చిన్న వ‌య‌సులో ల‌ఢ‌ఖ్ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టే అవ‌కాశం ద‌క్కింది. ల‌ఢ‌ఖ్ నుంచి మొద‌టిసారి పార్ల‌మెంట్‌కు ఎంపికైన నంగ్యాల్ చురుకైన యువ నాయ‌కుడు గుర్తింపు సంపాదించారు. పార్ల‌మెంటులో మంచి వాక్ప‌టిమ‌తో ప్ర‌సంగిస్తూ అగ్ర‌నేత‌ల అభినంద‌న‌లు అందుకున్నారు. ఈ అర్హ‌త‌లవ‌ల్లే వ‌య‌సు చిన్న‌దైనా నంగ్యాల్‌కు ల‌ఢ‌ఖ్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు.