భారతదేశాన్ని బలహీనపరిచి, చైనాను పటిష్టపరిచే చర్యలకు ఒక వారసత్వ కుటుంబం ప్రయత్నిస్తోందని అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా మండిపడ్డారు. రాహుల్ గాంధీ బురద చల్లే చర్యలకు పాల్పడుతున్నారని, ఇది ప్రాజెక్ట్ ఆర్‌జి రిలాంచ్ విఫల ప్రయత్నమని ధ్వజమెత్తారు.
లడఖ్ లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద చైనాతో ఏర్పడిన ఘర్షణ వాతావరణం కేవలం సరిహద్దు వివాదమే కాదని, 56 అంగుళాల ఛాతీగల బలవంతునిగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బతీయాలన్న చైనా కుట్ర ఇందులో దాగి ఉందని రాహుల్ గాంధీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు.
తమకు అనుకూలమైన పద్ధతిలో వ్యవహరించడానికే ప్రధాని నరేంద్ర మోడీపై చైనా ఒత్తిడి పెడుతోందని, లేకపోతే ఇప్పటివరకు ఎవరికీ తలవంచని వ్యక్తిగా, బలవంతుడైన నాయకుడిగా ఆయన సంపాదించుకున్న ప్రతిష్టను దెబ్బతీస్తుందని రాహుల్ ఆరోపించారు.
లడఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని ప్రకటించి మోడీ తన ప్రతిష్టను కాపాడుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. ఇది కేవలం సరిహద్దు సమస్య మాత్రమే కాదని, భారత ప్రధానమంత్రిపై ఒత్తిడి పెట్టేందుకు చైనా చేసిన కుట్రని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఒక ఆలోచనతోనే చైనా ఈ కుట్రకు పాల్పడిందని ఆయన ఒక లఘు వీడియోలో ఆరోపించారు.
దీనిపై బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎదురుదాడి చేస్తూ రాహుల్ యథావిధిగా అసత్యాలను ఆధారంగా చేసుకుని బురదచల్లే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రక్షణ, విదేశాంగ విధానాలను రాజకీయం చేసే ప్రయత్నాలు 1962 నాటి పాపాలను కడుక్కుని, భారతదేశాన్ని బలహీనపరచాలన్న ఒక వారసత్వ కుటుంబ నిస్పృహకు అద్దం పడుతున్నాయని ఆయన ఘాటుగా ఆరోపించారు.
అనేక సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీని నాశనం చేసేందుకు ఒక వారసత్వ కుటుంబం ప్రయత్నిస్తూనే ఉందని, వారికి బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రధాని మోడీ 130 కోట్ల మంది భారతీయుల గుండెల్లో గూడుకట్టుకున్నారని నడ్డా పేర్కొన్నారు. ప్రజల కోసమే జీవిస్తూ వారి కోసమే ఆయన పనిచేస్తున్నారని, మోడీని నాశనం చేయాలనుకునేవారు తమ సొంత పార్టీని నాశనం చేసుకుంటారని హెచ్చరిస్తూ నడ్డా ట్వీట్ చేశారు.
More Stories
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులు
హామీల ఎగవేతల బడ్జెట్
నన్ను జడ్జ్ చేయడానికి మీకున్న అర్హత ఏమిటి?