ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా అజేయ కల్లాం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా అధికారాలను కత్తిరించడం ద్వారా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కలాంను అవమాన పరిచామనే అపప్రధను తొలగించే ప్రయత్నంలో భాగంగా  ఆయనకు ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది. 

రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఈ బాధ్యతలను త్వరలోనే అప్పగించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిర్వహిస్తుండటం గమనార్హం.

జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అజేయ కల్లాం సిఎంఓలో ప్రధాన సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. ఆర్ధిక, సాధారణ పరిపాలన వంటి అనేక కీలక శాఖలకు ఆయన కీలకంగా వ్యవహరించారు.

అయితే కొద్ది రోజుల క్రితం ఊహించని విధంగా కల్లాంతోపాటు మరో కీలక అధికారిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ పివి రమేష్‌ల నుంచి శాఖలను తప్పించి, సర్వీసులో ఉన్న ఇతర అధికారులకు అప్పగించారు. ఇది పెను సంచలనానికి తెరతీసింది. దీంతో వారు రాజీనామాలు చేస్తారని కూడా ప్రచారం జరిగింది. 

ఈ నేపథ్యంలోనే సిఎంఓలో వివాదానికి తెర దించేలా నష్ట నివారణ చర్యలకు జగన్‌ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే జగన్‌కు అత్యంత సన్నిహితునిగా పేరొందిన విజయసాయిరెడ్డితో జగన్‌కు విబేధాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 

ఆయనను జగన్‌ పక్కనపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన సన్నిహితులు అంటున్నారు. అందుకే ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాను ఆయన నుంచి తప్పిస్తూ ఆ స్థానాన్ని అజేయ కల్లాంకు అప్పగించడం ద్వారా విజయసాయిరెడ్డికి కూడా ఝలక్‌ ఇచ్చినట్టవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

ఈ సమయంలో ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎక్కువగా సాధించేందుకు కూడా గతంలో ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కల్లాం అనుభవం ఉపయోగబడుతుందని ఆశిస్తున్నారు. కేంద్రంలోని అధికారులతో కూడా ఆయనకు ఉన్న అనుబంధం రాష్ట్రానికి మేలు చేస్తుందన్న భావాన్ని జగన్‌ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.