
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉండటం, పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రతి రోజూ 4,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.
పలు నగరాలలో ఇప్పటికే స్థానికంగా లాక్ డౌన్ ప్రకటించారు. పలు చోట్ల వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయి. సోమవారం అంతకు ముందు 24 గంటల్లో 33,580 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 53,724 కు చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 1335 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 24,228 కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 54 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 696 కు చేరింది. 28,800 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 13,49,112 నమూనాలను పరీక్షించిన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
సోమవారం ఏపీలో నమోదైన కరోనా కేసుల్లో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైం జిల్లా మొత్తం కర్ఫ్యూ విధిస్తున్నట్లు కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు.
తిరుపతిలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో తిరుపతి నగరంలో ఆగస్టు 5 వరకు కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్త తెలిపారు. చిత్తూరు జిల్లాలో 5400 కరోనా కేసులు నమోదుకాగా వీటిలో అత్యధికంగా తిరుపతిలోనే 1700 కేసులు నమోదయ్యాయి.
అత్యవసర సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా షాపులు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. మద్యం దుకాణాలు కూడా ఉదయం 11 గంటల వరకే తెరిచి ఉంటాయని చెప్పారు. ఈ సమయం దాటాకా వాహనాలకు కూడా అనుమతి ఉండదన్నారు.
More Stories
పొట్టి శ్రీరాములు పేరు మార్పుపై బిజెపి నిరసన
దళారుల చేతుల్లో మోసపోతున్న తిరుమల భక్తులు
జగన్ `అప్పుల రెడ్డి’ వైద్య విద్యను భ్రష్టు పట్టించారు