అస్సాంను ముంచెత్తుతున్న వరదలు

కరోనా మహమ్మరి ఒకవైపు, వరదలు మరోవైపు అస్సాం రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావంతో బ్రహ్మపుత్ర, బరాక్‌తో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. అస్సాంలో వరద సంబంధిత సంఘటనల్లో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, మరణించిన వారి సంఖ్య 85 కు చేరుకుందని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.  
 
దాదాపు 3వేల గ్రామాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని దాదాపు 70లక్షల మందిపై ఈ వరదల ప్రభావం పడినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ‘ఒక వైపు, కోవిడ్-19 కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వరదలతో తలెత్తే సవాళ్లు ఉన్నాయి. అయినప్పటికీ, రాష్ట్ర ప్రజలు యుద్ధం చేస్తూనే ఉన్నారు’ అని సోనోవాల్ తెలిపారు. 
 
ప్రస్తుతం వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సిబ్బంది జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన గ్రామాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మరోవైపు జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
మరో రెండు రోజుల్లో బ్రహ్మపుత్ర నది ప్రవాహం మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. 
 
వరదల తీవ్రతకు కజిరంగా జాతీయ పార్కులో ఇప్పటివరకు 108జంతువులు మరణించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మరో వందకుపైగా జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు.