మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ (85) కన్నుమూశారు. గత కొద్ది రోజుల అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు అషుతోష్‌ టాండన్‌ వెల్లడించారు. 

లాల్జీ టాండ‌న్ మృతి ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. టాండ‌న్ మృతి తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింద‌ని మోదీ ట్వీట్ చేశారు. స‌మాజ సేవ కోసం ఆయ‌న చేసిన కృషి ఎప్ప‌టికీ గుర్తుంటుంద‌ని పేర్కొన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో టాండ‌న్ కీల‌క‌పాత్ర పోషించార‌ని కొనియాడారు. ఎల్ల‌ప్పుడూ ప్ర‌జా సంక్షేమానికి ప్రాముఖ్య‌త ఇస్తూ.. స‌మ‌ర్థ‌వంత‌మైన నిర్వాహ‌కుడిగా గ‌వ‌ర్న‌ర్ టాండ‌న్ గుర్తింపు తెచ్చుకున్నార‌ని మోదీ తెలిపారు.

గవర్నర్‌ టాండన్‌ మృతిపట్ల మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గవర్నర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

గవర్నర్ లాల్జీ టాండన్ కొద్ది రోజుల‌ క్రితం సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌‌కు వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. జూన్ 11న జ్వరం, మూత్ర సంబంధ సమస్యలతో ఉత్తరప్రదేశ్ లక్నోలోని మేదాంత దవాఖానలో ఆయన చేరారు. అనంతరం ఆయనకు కాలేయం, కిడ్నీ సమస్యలున్నట్లు వైద్యులు గుర్తించారు. నాటి నుంచి మేదాంత దవాఖానలోనే లాల్జీ టాండన్ చికిత్స పొందుతున్నారు. 

జూన్ 30న, ఈ నెల 16న కూడా ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. తాజాగా సోమవారం గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు మేదాంత దవాఖాన మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. మంగ‌ళ‌వారం ఉద‌యం టాండ‌న్ క‌న్నుమూశారు. గ‌వ‌ర్న‌ర్ కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఫ‌లితం నెగిటివ్ వ‌చ్చింది.

బిజెపిలో సీనియర్‌ నేతగా గుర్తింపు పొందిన ఆయన పలు ఉన్నత పదవులను చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు, శాసన మండలికి పలుసార్లు ఎన్నికయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా మాయావతి ప్రభుత్వంలో మంత్రిగా కూడా వ్యహరించారు. కళ్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వంలోనూ కొనసాగారు. 

మాజీ ప్రధాని వాజపేయి లక్నో నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆయనకు ఎన్నికల ఏజెంట్ గా పనిచేసే వారు. ఆయన పోటీకి దూరంగా ఉన్న 2009లో లక్నో పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం తొలిసారి 2019 జూలై 20న మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా టాండన్‌ నిన్నటితో తొలి ఏడాది పూర్తి చేసుకున్నారు.