3 లేదా 5న రామాలయ భూమిపూజ

3 లేదా 5న రామాలయ భూమిపూజ
అయోధ్యలో రామాలయం భారీ ఎత్తున 161 అడుగుల ఎత్తుతో, ఐదు భారీ గోపురాలతో నిర్మితం కానున్నది. రామాలయ నిర్మాణానికి వచ్చేనెల 3 లేదా 5వ తేదీన భూమిపూజ జరుగనుంది. ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజలో పాల్గొననున్నారని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
 భూమి పూజకోసం రెండు తేదీలను ప్రధాని కార్యాలయానికి తెలియజేశామని,  ప్రధాని వీలును బట్టి 3 లేదా 5వ తేదీన భూమిపూజ కార్యక్రమం జరుగుతుందని ట్రస్టు సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్‌ తెలిపారు.
ఆలయ నిర్మాణం గురించి చర్చించేందుకు ట్రస్టు శనివారం సాయంత్రం అయోధ్యలో సమావేశమైంది. గ్రహాలు, నక్షత్రాల స్థితిగతులను బట్టి ఈ తేదీలను నిర్ణయించినట్టు నిత్యగోపాల్‌ దాస్‌ ట్రస్టు అధ్యక్షుడు మహంత్‌ కమల్‌ నయన్‌ దాస్‌ వెల్లడించారు. దేశంలో 10 కోట్ల కుటుంబాలను కలిసి నిర్మాణానికి అవసరమైన నిధులు సేకరిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణ ప్రదేశంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ మృత్తిక పరీక్షలకోసం నమూనాలు సేకరిస్తున్నదని, 60 మీటర్ల లోతులో మట్టి నాణ్యతను బట్టి ఆలయ నమూనాను నిర్ణయిస్తామని ట్రస్టు కార్యదర్శి చంపక్‌రాయ్‌ తెలిపారు. మందిరం తుది డిజైన్‌ను ఆమోదించిన తర్వాత మూడు నుంచి మూడున్నరేండ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.