దేశంలో సామాజిక వ్యాప్తి దశలో కరోనా

దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని, ఇప్పటికే పదిలక్షల మంది కరోనా బారిన పడినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) తెలిపింది. దేశంలో ప్రతి రోజూ 30వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇది చాలా దురదృష్ట్యకరమైన పరిస్థితి.
ముఖ్యంగా ఈ వైరస్‌ గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఇది సామాజిక వ్యాప్తికి సంకేతమని ఐఎంఎ హాస్పిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వీకే మోంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్‌ను అదుపు చేయడం చాలా కష్టమైన విషయమని ఆందోళన వ్యక్తం చేసారు.
ప్రస్తుతానికి ఢిల్లీలో కట్టడి చేసినా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర సహకారంతో పరిస్థితిని అదుపు చేసేందుకు కృషిచేయాలని సూచించారు. కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని స్పష్టం చేశారు.
 ప్రస్తుతం 885 ప్రభుత్వ లాబరేటరీలు ఉండగా, 368 ప్రైవేట్‌ ల్యాబరేటరీలు ఉన్నాయని చెప్పారు. వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరల్‌ వ్యాధిని కట్టడి చేయడానికి రెండే మార్గాలున్నాయని ఒకటి, ఈ వ్యాధి సోకిన 70 శాతం మంది రోగ నిరోధకశక్తిని పెంచుకోవడం, రెండోది మిగిలిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని డాక్టర్‌ మోంగా వివరించారు. 
ఇలా ఉండగా, శనివారం అంతకు ముందు 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 34,884 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 10,38,716కు చేరుకుంది. వీరిలో 3,58,692 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 6,53,750 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. యాక్టివ్‌లకన్నా రికవరీలు రెట్టింపుగా ఉండడం విశేషం.
మరోవైపు శుక్రవారంతో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గడం గమనార్హం. కొత్తగా మరో 671 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 26,273కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా నిన్న ఒక్క రోజే 3,61,024 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు 1,34,33,742 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఐసిఎంఆర్ తెలిపింది.