ఆస్ట్రేలియాలో ఇక తెలుగు ఐచ్ఛికం

ఖండాంతరాల్లో వ్యాపించిన తెలుగు భాషకు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. అక్కడి బడుల్లో తెలుగును ఐచ్ఛిక అంశంగా చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒకటి నుంచి పన్నెండు తరగతి వరకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషను నేర్చుకునే అవకాశం కలగనుంది. 

ఈ ప్రకటన స్థానిక తెలుగువారినే కాకుండా యావత్ ప్రపంచంలోని తెలుగువారికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు హిందీ, పంజాబీ, తమిళ భాషలకు మాత్రమే అక్కడి ప్రభుత్వ గుర్తింపు లభించింది. తాజాగా ఆ జాబితాలో నాలుగో భాషగా తెలుగు చేరింది. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్, సౌత్ ఆస్ట్రేలియా మొదలైన రాష్ట్రాల్లోని తెలుగువారికి ప్రయోజనం కలగనుంది.

తెలుగును కమ్యూనిటీ భాషగా గుర్తించాలని ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య (ఎఫ్‌టీఏఏ: ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలుగు అసోసియేషన్స్‌ ఇన్‌ ఆస్ట్రేలియా) వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీకృష్ణ నడింపల్లి (ఓఏఎం-కాన్‌బెర్రా) స్థానిక తెలుగు సంఘాలతో కలిసి 2014లోనే అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలుగువారి జనాభా తక్కువగా ఉండటంతో అప్పట్లో ఆ విజ్ఞాపనను తిరస్కరించారు.

తెలుగు మాట్లాడేవారంతా తమ మాతృభాషగా తెలుగును నమోదుచేయాలని విస్తృత ప్రచారం చేపట్టారు. దీంతో ఆ సంఖ్య భారీగా పెరిగింది. కమ్యూనిటీ భాషగా తెలుగుకు గుర్తింపు లభించింది. కొన్నేండ్లుగా ఎన్‌ఏఏటీఐతో ఎఫ్‌టీఏఏ సభ్యులు జరిపిన సంప్రదింపులు ఫలప్రదమయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడేవారు 80 వేల మందికిపైగా ఉంటారని అంచనా.

వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక గణాంకాల్లో అందరూ తెలుగును మాతృభాషగా నమోదుచేసుకోవాలని అక్కడి తెలుగు ప్రతినిధులు మరోసారి పిలుపునిచ్చారు. అప్పుడే భావితరాలకు తెలుగు నేర్పడం సులువవుతుందని పేర్కొన్నారు.


తాజా ఆదేశాలతో తెలుగు భాషను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకొన్న వారికి ఉత్తీర్ణతలో ఐదు పాయింట్లు అదనంగా లభించనున్నాయి. అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకునే వారికి కూడా ఇది ప్రయోజనం కలిగించనుంది. ఇకపై శాశ్వత నివాసం కోసం తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆదేశాల్లో పేర్కొన్నారు. 

నేషనల్‌ అక్రిడిటేషన్‌ అథారిటీ ఫర్‌ ట్రాన్సిలేటర్స్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటర్స్‌ నిర్వహించే పరీక్ష రాసేవారికి కూడా తెలుగుకు ఐదు పాయింట్లు అదనంగా కలుస్తాయి. ఈ విధానం వల్ల స్థానికంగా ఉన్న లక్ష మంది తెలుగువారికే కాకుండా ఉద్యోగాలు, వివిధ వ్యాపారాలపై అక్కడ ఉండే వారికి ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రకటన పట్ల స్థానిక తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలుగు సమాఖ్య సభ్యులు, తెలుగుమల్లి, భువనవిజయం వంటి సాంస్కృతి సంస్థలు ఏళ్లుగా చేస్తున్న కృషికి దక్కిన ఫలితం ఇది. సుమారు 16ఏళ్లుగా భాషాభిమానులు తీవ్రంగా కృషి చేయగా ఇప్పటికి ఆస్ట్రేలియా ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.