మన భూమిలో నుంచి ఒక్క అంగుళాన్నీ పోనివ్వం

Ladakh, July 17 (ANI): Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane arrive at Stakna in Leh on Friday. Defence Minister is on a two-day visit to Ladakh and Jammu & Kashmir. (ANI Photo)

`ఆక్రమణ యుగం ముగిసింది. ఇది అభివృద్ధికి సంబంధించిన యుగం. దురాక్రమణకు దిగిన వారు ఓడిపోతారు లేదా బలవంతంగా వెనక్కి తగ్గుతారనేది చరిత్ర చెబుతోంది. నేను మీకు భరోసా ఇవ్వగలను.. ప్రపంచంలోని ఏ శక్తి కూడా మన భూమిలో నుంచి ఒక్క ఇంచును కూడా తీసుకుపోదని హామీ ఇవ్వగలను’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ లడఖ్‌ చేరుకున్నారు. అక్కడి రక్షణ పరిస్థితులను మహా దళపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణేతో చర్చించారు. ఐటీబీటీ, వాయుసేన, ఆర్మీకి చెందిన సీనియర్ కమాండర్లతో ఆయన భేటీ అయ్యారు.  

ఇరు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ప్రకటించారు. అయితే ఈ చర్చల వల్ల సమస్య ఎంత మేరకు పరిష్కారం అవుతుందో మాత్రం చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు.

చర్చలతోనే ఇరు దేశాలకు పరిష్కారం లభిస్తే. అంతకన్నా కావాల్సింది ఏముంటుందని ప్రశ్నించారు. ఇరు దేశాలకు చెందిన భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో సరిహద్దును కాపాడే క్రమంలో కొందరు వీర మరణం పొందారని కొనియాడారు. 

జవాన్లందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, అయితే జవాన్లు వీర మరణం పొందడం మాత్రం కాస్త లోటేనని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘర్షణలో వీర మరణం పొందిన వారికి నివాళులర్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

వారి త్యాగాన్ని ఈ దేశం ఎన్నటికీ మరిచిపోదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. భారతీయ జవాన్ల తల్లిదండ్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత సరిహద్దులను కాపాడుతున్న ప్రతి జవాన్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

చైనాతో ఘర్షణ జరిగిన సమయంలో కేవలం భారత భూభాగాన్నే కాపాడలేదని, కోట్లాది మంది భారతీయుల గౌరవాన్ని కూడా కాపాడారని ఆయన ప్రశంసించారు. భారతీయ జవాన్లలో స్వాభిమానం మెండుగానే ఉంటుందని చెబుతూ అన్ని స్వాభిమానాల కంటే దేశం విషయంలో ఉండే స్వాభిమానం చాలా ఉత్కృష్టమైందని ఆయన ప్రశంసించారు.

భారత్‌ ఇప్పటి వరకూ ఏ దేశ భూభాగంపై కన్నేయలేదని, ఒక్క ఇంచు భూమిని కూడా ఆక్రమించాలన్న ఆలోచన కూడా రాలేదని గుర్తు చేశారు. కేవలం భారతీయుల్నే కాక.. ప్రపంచం మొత్తాన్ని కుటుంబంగా భావిస్తామని, ‘వసుధైక కుటుంబకం’ అన్న మంత్రం ద్వారా ముందుకు సాగుతున్నామని రాజ్‌నాథ్ ప్రకటించారు.

సరిహద్దులోని లఢక్, లు‌కుంగ్ సైనిక స్థావరాలను శుక్రవారం ఆయన సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న ఆర్మీ, ఐటీబీపీ సైనికులతో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. గల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో పాల్గొన్న సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.  

అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాలను ఆయన సందర్శించడంతో పాటు అక్కడి పరిస్థితులపై సైనిక అధికారులతో సమీక్షిస్తారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.