కుల్గాంలో ముగ్గురు ఉగ్రవాదుల హతం   

కుల్గాంలో ముగ్గురు ఉగ్రవాదుల హతం   
జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని నాగనాడ్ చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.కుల్గాం జిల్లాలోని నాగనాడ్ చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల కోసం శుక్రవారం గాలింపు చేపట్టగా దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
 
దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.దీంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటరులో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఉగ్రవాదులను గుర్తించనున్నారు. ఈ ఏడాది జమ్మూకశ్మీర్ లోయలో జరిగిన ఎదురుకాల్పుల్లో 131 మంది ఉగ్రవాదులు మరణించారు. శుక్రవారం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.   
 
ఇలా ఉండగా, పాకిస్థాన్ టెర్రర్ గ్రూప్ నాయకుడు, తెహ్రీక్ -ఇ-తాలిబాన్(టీటీపీ) కు చెందిన పాకిస్థాన్ నాయకుడు ముఫ్తీ నూర్ వాలి మహసూద్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అల్ ఖైదాతోపాటు అనుబంధ ఉగ్రవాద సంస్థలకు మద్ధతుగా ఆర్థిక వనరులను సమకూర్చడంతోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన నూర్ వాలి మహసూద్ ను అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ ఆంక్షల జాబితాలోకి చేర్చింది. 
 
పాకిస్థాన్ తాలిబాన్ గా పిలిచే టీటీపీ పలు ఆత్మాహుతి దాడుల్లో వందలాది మంది పౌరులను చంపింది. దీంతో టీటీటీ ఉగ్రవాద సంస్థను గతంలో గ్లోబల్ టెర్రరిస్టు సంస్థగా ప్రకటించారు. పాకిస్థాన్ లో పలు ఉగ్ర దాడులకు టీటీపీనే కారణమని అమెరికా పేర్కొంది. 
 
గత ఏడాది ఐక్యారాజ్య సమితి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. మళ్లీ టీటీటీ ఉగ్రవాద సంస్థ నాయకుడు నూర్ వాలిమహసూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడంతో ఉగ్రవాదులకు మద్ధతు ఇస్తున్న పాకిస్థాన్ కు మరో దెబ్బ తగిలినట్లయింది.