దేశంలో 10 లక్షల కేసులు, 25 వేల మరణాలు 

భారత దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గురువారం రాత్రి 9.30 గంటల వరకు అందిన సమాచారం మేరకు దేశంలో కేసుల సంఖ్య 10,00,202కి చేరింది. ఫలితంగా కొవిడ్‌ కేసుల్లో మనదేశం ప్రపంచంలో మూడో స్థానానికి చేరింది.  
మన కంటే ముందు అమెరికా, బ్రెజిల్‌ ఉన్నాయి. ఇక దేశంలో మొత్తం మరణాల సంఖ్య గురువారం రాత్రికి 25,553కి చేరుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో 32,695 కొత్త కేసులు నమోదయ్యాయని, 606 మంది మరణించారని తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. 

ఈ కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాల్లోనే 80 శాతం ఉండడం గమనార్హం. దేశవ్యాప్తంగా 9,68,876 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 24,915 మంది మరణించినట్లు వివరించింది. కోలుకున్న వారి సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతోందని, 6,12,815 మంది కోలుకున్నారని తెలిపింది. 

ప్రస్తుతం దేశంలో 3,31,146 యాక్టివ్‌ కేసులున్నాయని, మొత్తం కేసుల్లో మూడో వంతు మాత్రమే చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. జూన్‌ 15 నాటికి రికవరీ రేటు 50 శాతంగా ఉందని, అప్పటి నుంచి స్థిరంగా పెరుగుతోందని.. యాక్టివ్‌ కేసుల సంఖ్య అదేస్థాయిలో తగ్గుతోందని పేర్కొంది. ఇప్పటికే 63.25శాతం రోగులు కోలుకున్నట్లు తెలిపింది. 

మొత్తం యాక్టివ్‌ కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడుల్లోనే 48.15శాతం ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్‌ తీవ్రతలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో గడిచిన ఒక్కరోజులోనే 8641 కేసులు రాగా.. 266 మంది మరణించారు. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో ఒక్క రోజే 4,549 పాజిటివ్‌లు నమోదవగా.. 68మంది మరణించారు. రాష్ట్రంలో  కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 

కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య అరలక్ష దాటింది. మహారాష్ట్ర తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ నీలా సత్యనారాయణన్‌ కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది మానసిక ఆరోగ్యానికి సంబంధించి జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్సెస్‌ సంస్థ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇలా ఉండగా, సెప్టెంబర్ 1  నాటికి దేశంలో పాజిటివ్ కేసులు 35  లక్షలకు చేరుతాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) బృందం అంచనా వేసింది. ప్రస్తుతం వైరస్‌ ఉధృతిని పరిగణనలోకి తీసుకొని అంచనాలు రూపొందించింది. ఒక్క కర్ణాటకలోనే 2.1 లక్షలు నమోదు కావొచ్చని తెలిపింది. 2021 మార్చి చివరికల్లా 1.4 లక్షల యాక్టివ్‌ కేసులు, 1.88 లక్షల మరణాలు సంభవించొచ్చని ప్రొఫెసర్లు శశికుమార్‌, దీపక్‌ నేతృత్వంలోని బృందం అంచనా వేసింది.