ఐరాసను సంస్కరించాలని ప్రధాని మోదీ పిలుపు

నేటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితిని సంస్కరించాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ పరిణామాల నుంచి ఐరాస పురుడు పోసుకుందని, ఇప్పుడు కరోనా మహమ్మారి పరిస్థితులు ఐరాసకు పునర్జన్మ కల్పించాల్సిన, సంస్కరించాల్సిన అవసరాన్ని ఏర్పరిచాయని స్పష్టం చేశారు. 

ఐరాస సామాజిక, ఆర్థిక మండలి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ ఐరాసను స్థాపించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నేటి ప్రపంచంలో ఐరాస పాత్ర, ప్రాసంగితను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఐరాస పుట్టుక నుంచి ఇప్పటివరకు అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, సభ్యదేశాల సంఖ్య 193కి చేరుకున్నదని గుర్తు చేశారు. 

అలాగే సంస్థపై అంచనాలు కూడా పెరిగాయని చెబుతూ అదే సమయంలో బహుళత్వవాదం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ‘బహుళత్వవాదం ద్వారానే సుస్థిర శాంతి, సుసంపన్నత సాధ్యమని భారత్‌ విశ్వసిస్తున్నది. అయితే ఈ బహుళత్వవాదం నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించాల్సిన అవసరం ఉన్నది’ అని ప్రధాని స్పష్టంచేశారు. 

ఐరాస, బహుళత్వవాదం సంస్కరణలతోనే మానవ ఆకాంక్షలను సుసాధ్యం చేసేందుకు వీలవుతుందని ప్రధాని చెప్పారు. ప్రపంచ బహుముఖీయ వ్యవస్థను సంస్కరించేందుకు ప్రతినబూనాలని ప్రపంచదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి భారత్‌ అత్యంత కీలక సమయంలో ఎన్నికైందని చెప్పారు. 

శాంతి, సామరస్యత, ఆర్థిక-సామాజిక సమానత్వం, ప్రకృతి సమతుల్యతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో 150 దేశాలకుపైగా భారత్‌ ఔషధాలు సరఫరా చేసిందని మోదీ గుర్తు చేశారు. ప‌్ర‌పంచంలోనే అత్యుత్త‌మ కోవిడ్‌-19 రిక‌వ‌రీ రేట్ల‌లో భాదేశం ఒక‌ట‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. కోవిడ్-19 మ‌హ‌మ్మారి అన్ని దేశాల‌ను తీవ్రంగా ప‌రీక్షించింద‌ని పేర్కొన్నారు.

ఈ మ‌హ‌మ్మారికి వ్య‌తిరేకంగా భార‌త్‌లో పోరాటం ప్ర‌జా ఉద్య‌మంగా మార్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు చెప్పారు. ప్ర‌భుత్వం, పౌర స‌మాజాన్ని క‌ల‌ప‌డం ద్వారా ప్ర‌య‌త్నించిన‌ట్లు వెల్ల‌డించారు. స్వ‌తంత్ర దేశంగా భార‌త్ 75 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకునేనాటికి 2022 నాటికి ప్ర‌తీ భార‌తీయుడు సుర‌క్షిత‌మైన ఇంట్లో ఉండేవిధంగా అంద‌రికి ఇళ్లు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

ఏ ఒక్క‌రిని విడిచిపెట్ట‌కుండా న‌మ్మ‌కంతో అంద‌రి ఎదుగుద‌ల‌కు కృషిచేయ‌డం ఇదే త‌మ నినాద‌మని చెప్పారు. దేశీయ ప్రయత్నాల ద్వారా అజెండా 2030 సాధించేందుకు కృషి చేస్తున్న‌ట్లు ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న‌ట్లు చెప్పారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు సైతం వారి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో కూడా తాము మద్దతు ఇస్తున్నామని గుర్తు చేశారు.

ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా ఈ మండలి అభివృద్ధి ప‌నుల‌కు భార‌త్ మొద‌టినుండి మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఈ మండలి మొదటి అధ్యక్షుడు ఒక భారతీయుడు అని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మండలి ఎజెండాను రూపొందించడానికి భారత్ కూడా దోహదపడిందని పేర్కొ‌న్నారు.

ప్ర‌పంచంలో భార‌త్ ప్ర‌త్యేక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ  ఆయుష్మాన్ అనేది పెద్ద ఆరోగ్య కార్య‌క్ర‌మం అని గుర్తు చేశారు. సుమారు 40 కోట్ల మందితో బ్యాంక్ ఖాతాలు తెరిపించిన‌ట్లు వెల్ల‌డించారు. 7 కోట్ల మంది మ‌హిళ‌లు స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లో ఉన్నారన్న ప్ర‌ధాని భార‌త్‌ను 2025 నాటికి టీబీ ర‌హిత దేశంగా మారుస్తామ‌ని పేర్కొన్నారు.