దేశం ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ధారావి, ముంబై వంటి వంటి ప్రదేశాల్లో స్థానిక సంక్రమణ ప్రారంభమైనప్పటికీ దాన్ని సమర్థవంతంగా నియంత్రించామని తెలిపారు. ముఖ్యంగా దేశంలో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు దాదాపు 60 శాతంగా ఉండటం సానుకూల అంశంగా తెలిపారు.
ఇప్పటివరకు 9 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, 23వేల మంది ప్రాణాలు విడిచారు. అయినా మరణాల్లోనూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల సంఖ్య తక్కువగానే ఉందని పేర్కొన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అభివృద్ధికి సమయం పడుతుందని, కానీ అందుకు నెల, సంవత్సరమా అన్న విషయం ఎవరూ చెప్పలేరని చెప్పారు.
కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటినప్పటికీ రికవరీ రేటు కూడా పెరగడం ఊరటనిచ్చే అంశమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మే 2 నుంచి 30 మధ్య రికవరీ కేసుల కంటే కోవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉండేదని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు 1.8 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
దేశంలోని 20 రాష్ట్రాలలో రికవరీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని.. మొత్తంగా దేశంలో కరోనా రికవరీ రేటు 63 శాతంగా ఉందని తెలిపింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌లో రికవరీ రేటు అత్యధికంగా(70 శాతం) ఉందని పేర్కొంది.
ఇక కరోనా కేసుల వృద్ధిరేటు గణనీయంగా తగ్గుతోందని, ప్రస్తుతం ఇది 3.4 శాతంగా ఉందని వెల్లడించింది. ప్రతీ 10 లక్షల జనాభాకు 657 కేసులు నమోదవుతున్నాయని.. 8 రాష్ట్రాల నుంచి 36 శాతం కేసులు నమోదయ్యాయని తెలిపింది.
మొత్తం పది రాష్ట్రాల నుంచి 86 శాతం కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. దేశంలో మొత్తం కరోనా కేసులలో 50 శాతం మహారాష్ట్ర, తమిళనాడుకు చెందినవేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఓఎస్‌డీ రాజేశ్ భూషణ్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
More Stories
సామరస్యంతోఅస్పృస్యతను పూర్తిగా నిర్ములించాలి
డొనాల్డ్ ట్రంప్ సమీపంలో కాల్పులు.. మరోసారి హత్యాయత్నం?
సినీ నటి జేత్వాని వేధింపుల కేసులో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు