రాజస్థాన్ డిప్యూటీ ముఖ్యమంత్రిని పదవి నుంచి సచిన్ పైలట్‌ను తొలగించినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం కొత్తమలుపు తిరిగింది. అలాగే రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా ఆయనను తొలగించినట్లు ఆ పార్టీ సీనియర్ నేత, రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు.
పైలట్‌తోపాటు మరో ఇద్దరు అసమ్మతి మంత్రులు రమేష్‌మీనా, విశ్వేంద్రసింగ్‌లను కూడా మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు సీఎల్పీ భేటీకి హాజరుకాని మంత్రులు, ఎమ్మెల్యేలపైనా క్రమశిక్షణా చర్యలకు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పైలట్ స్థానంలో రాజస్తాన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా గోవింద్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది.
సచిన్ పైలట్, అతడి సహచరులు కొందరు బీజేపీ కుట్రలో చిక్కుకున్నారని, 8 కోట్ల మంది రాజస్థానీలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర చేస్తుండటాన్ని తాను చింతుస్తున్నానని రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా అధిష్టానం అనేకమార్లు జరిపినప్పటికీ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదని సుర్జేవాలా ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.
మరోవైపు మంగళవారం జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ హాజరుకాలేదు. సోమవారం కూడా హాజరు కాకపోవడంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని ఆ భేటీలో పాల్గొన్న 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత గవర్నర్ ను కలసిన ముఖ్యమంత్రి అశోక్ గేలాట్ సచిన్ కు చాలావకాశాలు ఇచ్చామని తెలిపారు.
అశోక్ గహ్లోత్‌కు బానిసత్వం చేయలేమని, సీఎంగా ఆయన తప్ప వేరేవరైనా సరేనని సచిన్ పైలట్ వర్గం నేతలు అంతకు ముందు పార్టీ అధిష్ఠానంకు సంకేతం పంపారు. ఇక ఆదివారం నాటి వాట్సాప్ మెసేజ్‌లో 30 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని చెప్పిన పైలట్ సోమవారం రాత్రి ఓ వీడియో విడుదల చేశారు.
గురుగ్రామ్‌లోని మానెసర్ హోటల్‌లో ఉన్న పైలట్ టీమ్‌లో దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు కనిపించారు. అయితే ఈ చర్యపై ఆశ్చర్యం పొందని సచిన్ సాయంత్రం 5 గంటలకు ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. కాగా సత్యాన్ని ఎక్కువగా కప్పిపుచ్చలేరని అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు సచిన్ పైలట్‌కు భారతీయ జనతా పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని ఆ పార్టీ ఎంపీ ఓం మథుర్ ప్రకటించారు. బీజేపీలోకి చేర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి