మమతా ప్రభుత్వాన్ని రద్దు చేయండి 

బెంగాల్ లో రాజకీయ హత్యలకు పాల్పడుతున్న తృణమూల్ కాంగ్రెస్ సర్కారును రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ కోరింది.  బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ, ఎంపీలు  రాజు బిస్తా, స్వపన్ దాస్ గుప్తా తదితరులు రాష్ట్రపతిని కలిసి మమత సర్కారుపై ఫిర్యాదు చేశారు. 

బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే మృతి నేపథ్యంలో నేతలంతా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. “బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని  ఉరివేస్తున్నారు. ఇదివరకు మా కార్యకర్తలను హత్యచేసేవారు. ఇప్పుడు ఏకంగా ప్రజాప్రతినిధులనే చంపేస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంటూ ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీని రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.  మూడేళ్లలో తమ పార్టీకి చెందిన 105 మందికిపైగా నాయకులు, కార్యకర్తలను హత్య చేసినట్లు విజయవర్గీయ ఆరోపించారు.

రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు మమత సర్కారు పోలీసులు, ఇతర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ నేత దేవేంద్రనాథ్ రేది హత్యేనని, దీనిని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మరోవంక, ఉరి వేసుకోవడం వల్లే బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర నాథ్ రే చనిపోయారని శవపరీక్ష నివేదిక పేర్కొంది. శరీరంలోఆ ఎలాంటి గాయాలు లేవని తెలిపింది. సోమవారం 

బిందాల్ గ్రామంలోని ఇంటి దగ్గర ఓ షాపు బయట సీలింగ్ కు వేలాడుతూ ఆయన మృతదేహం దొరికింది. తన చావుకు ఇద్దరు కారణమని సూసైడ్ నోట్ లో ఆయన రాసినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు శవపరీక్ష నివేదికపై తమకు నమ్మకం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.