యుపిలో మూడు రోజుల లాక్‌డౌన్ 

ఉత్తరప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో అకస్మాత్తుగా మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త  లాక్‌డౌన్   విధించారు. కరోనా తీవ్రత దృష్ట్యా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఈ  లాక్‌డౌన్   అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. 

లాక్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. అవసరంలేని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, అవసరం లేని వస్తు సముదాయాలు, మాల్స్, రెస్టారెంట్లు మూసివేయబడతాయని కూడా తెలిపింది. బస్సులు, ఇతర ప్రజా రవాణా కూడా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా యూపీ నుంచి బయటకు రైళ్లు వెళ్లవు కానీ, బయట నుంచి యూపీకి వచ్చే రైళ్లు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. వాటిలో వచ్చే ప్రయాణికులు వారివారి గమ్యస్థానాలు చేరడం కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అన్నీ అనుకూలిస్తే సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు లాక్‌డౌన్ ఎత్తివేస్తామని అధికారులు తెలిపారు. 

గ్రామీణ ప్రాంతాల్లోని కర్మాగారాలు యధావిధిగా పనిచేస్తాయని తెలిపింది. అంతేకాకుండా రోడ్లు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల పనులు కూడా జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటివరకు 30,000కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 20,000 మందికి పైగా రోగులు కోలుకోగా.. 845 మంది రోగులు మరణించారు.