బలమైన సంకల్పంతో పైలట్ గా పుణ్య నాంజప్ప

చిన్న తనంలోనే తండ్రి  మరణించడంతో, తల్లి ఎంతో కష్టపడి చదివించగా, అప్పటి నుండి పైలట్ కావాలని కలలు కంటూ పుణ్య నంజప్ప నెరవేర్చుకున్నారు. పట్టుదల ఉంటె ఎంతటి కార్యమైనా సాధింపవచ్చని నిరూపించుకున్నారామె. 
కర్నాటకకు చెందిన పుణ్య నాంజప్ప ధీరోధాత్తమైన ఆశయంతో ముందుకు సాగింది. భారత వైమానిక దళంలో యుద్ధనారిగా కఠోర శిక్షణ పొందుతోంది.  ఇటీవల ‘ఇండియన్‌ ఆర్మీ ఫైటర్‌ పైలట్‌’ ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని ‘ఫైటర్‌ స్ట్రీమ్‌ ఎట్‌ ద ఇండియన్‌ ఆర్మీ’ (ఐఎఎఫ్‌) కోర్సులో చేరింది. 

41 మంది విద్యార్థులున్న ఆ కోర్సులో పుణ్య నంజప్ప ఒక్కరే అమ్మాయి. ఈ కోర్సు యుద్ధ రంగానికి సంబంధించింది. గతేడాది ‘ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీ’లో ట్రైనీ పైలట్‌గా ఎంపికై కర్నాటక నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక మహిళగా వార్తలోకెక్కింది. జులై 8న హైద్రాబాద్‌ దుండిగల్‌లోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో మూడు దశల ట్రైనింగ్‌ పూర్తి చేసుకొని ఇప్పుడు ఐఎఎఫ్‌ పైలట్‌గా చేరింది.

పుణ్య తల్లి అనురాధ ఒక స్కూలు టీచరు. తండ్రి కొలువంద పి.బాలకోటయ్య పుణ్య చిన్నతనంలోనే మరణించారు. ఆయన ఓ సినిమా థియేటర్లో మేనేజర్‌గా పనిచేసేవారు. కొడగు జిల్లా వరాజ్‌పేట తాలుకాలోని చంబెబెల్లూర్‌ వారి స్వస్థలం. తొమ్మిదో తరగతి నాటి నుంచే పైలట్‌ కావాలని పుణ్య కలలు కనేదని చెబుతారు ఆమె తల్లి.

‘అమ్మాయిలకు ఈ రంగం కొత్త. అయినా సరే తన కల సాకారం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడింది. చివరకు అనుకున్నది సాధించింది’ అంటారామె ఆనందంగా. పుణ్య అకాడమీలో హవార్డ్‌ క్యాంప్‌లో రెండో స్థానంలో నిలిచి ఎన్నో పతకాలు సాధించింది. ఇప్పటికే మొదటి దశ శిక్షణ పూర్తి చేసింది. 

హకీంపేట ట్రైనింగ్‌ సెంటర్లో రెండు, మూడు దశల శిక్షణ పొందుతోంది. అది పూర్తయిన తరువాత ‘ఫ్లయింగ్‌ స్క్వాడ్రాన్‌’లో నియమితురాలవుతుంది. ”ఇది చాలా కఠినమైనది. వచ్చే డిసెంబరులో జరిగే పాసింగ్‌ పరేడ్‌లో వాటిని అధిగమించి అధికారిగా నియమించ బడుతుందని ఆశిస్తున్నాను” అంటోంది తల్లి. 

అకాడమీలో చేరేనాటికి పుణ్య మైసూరు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసింది. బాల్యంలోనే తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పుణ్య, మైసూరు దసరాకు నిర్వహించే ‘ఎయిర్‌ షో’లను తప్పకుండా వీక్షించేది. 

2018లో ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మినేషన్‌ టెస్ట్‌ (ఎఎఫ్‌సిఎటి)లో ఎంపికై మొదటి మెట్టు అధిగమించింది. 2019లో ట్రైనీ పైలట్‌గా ఎంపికై తన లక్ష్యానికి చేరువగా వచ్చింది. అనుకున్న లక్ష్యం సాధించాలంటే కలలు మాత్రమే కాదు; వాటిని నెరవేర్చుకునేలా బలమైన సంకల్పం, కృషీ ఉండాలని చెబుతోంది పుణ్య.