కరోనాపై గవర్నర్ దృష్టి… ఇరకాటంలో కేసీఆర్ 

కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం చేతులెత్తేసిన్నట్లు సర్వత్రా విమర్శలు చెలరేగుతున్న సమయంలో స్వయంగా  డాక్టర్ అయిన గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ఈ విషయమై దృష్టి సారించడం ఆసక్తి కలిగిస్తున్నది. దానికి కేసీఆర్ ఇరకాటంలో పదిన్నట్లు కనిపిస్తున్నది. 
 
రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి సమీక్షకు రాజ్ భవన్ కు సోమవారం సాయంత్రం 4గంటలకు రావాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి రాజ్‌భవన్‌ కబురు పెట్టారు. 
అయితే వీరిద్దరూ వెళ్లలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయని, తాము రాలేమని రాజ్‌భవన్‌కు తేల్చిచెప్పారని సమాచారం. 
 
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా వారిద్దరూ గవర్నర్ సమావేశానికి గైరజరయ్యే అవకాశం  వర్గాలు భావిస్తున్నాయి. అధికారులతో పరిస్థితిని సమీక్షంచనున్నట్లు గవర్నర్ స్వయంగా ట్వీట్ చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం అసహననానికి గురైనట్లు కనిపిస్తున్నది.  అయితే మంగళవారం సాయంత్రం తిరిగి వారితో సమావేశం జరపాలని గవర్నర్ భావిస్తున్నారు.
 సోమవారం సాయంత్రం దాదాపు గంటపాటు గవర్నర్ ట్విట్టర్ వేదికగా కరోనాపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. మంగళవారం ఉదయం ప్రైవేటు హస్పిటళ్ల మేనేజ్మెంట్లతో సమావేశం అవుతున్నట్టు  ఆమె వెల్లడించారు.
 
‘‘ఐసోలేషన్ సౌకర్యాలు, బెడ్స్ , బిల్లింగ్ , టెస్టింగ్ తదితర అంశాల్లో పబ్లిక్ సందేహాలు , ఫిర్యాదులపై చర్చించేందుకు, కరోనాను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రైవేట్ హాస్పిటళ్ల ప్రతినిధులతో సమావేశం అవుతున్నాను’’ అని ఆమె తెలిపారు. 
 
ప్రైవేట్ ఆసుపత్రులను కట్టడి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైనదని, వారు దారుణంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆందోళనలు వ్యక్తం అవుతున్న సమయంలో ఆమె ఈ సమావేశం జరపడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 
 
తమిళిసై మొదట్నించి రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై  ఆరా తీస్తున్నారు. స్వయంగా నిమ్స్ కు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  ప్రభుత్వం సరిగా టెస్టులు నిర్వహించడం లేదని, కేసులపై వాస్తవాలు వెల్లడించడం లేదని రాజకీయ పార్టీలు ఆమెకు ఫిర్యాదు చేశాయి.    
 
ఈ సందర్భంగా నెటిజన్లు.. రాష్ట్రంలో కరోనా తీవ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదులు చేశారు. కరోనా కట్టడిలో రాష్ట్ర సర్కార్ విఫలమైనదని, పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు హాస్పిటళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని గవర్నర్ దృష్టికి తెచ్చారు. పలు ప్రశ్నలకు ఆమె ఓపికగా సమాధానం ఇచ్చారు.
 
 ప్రైవేటు ఆస్పత్రుల విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలని, కరోనా విషయంలో సాయం చేయాలని వారు ట్విటర్‌ ద్వారా గవర్నర్ ను వేడుకున్నారు. ప్రభుత్వంకు తాను ఈ విషయమై వ్రాస్తున్న లేఖలకు తగు సమాధానాలు రావడం లేదని ఆమె గత నెలలో ఒక ఇంటర్వ్యూ లో అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
మరోవంక,  రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండు రోజుల పాటు 1800 పైచిలుకు పాజిటివ్‌లు రాగా,  ఆదివారం మాత్రం కాస్త తగ్గి 1590 కేసులే వచ్చాయి. అత్యధికంగా గ్రేటర్‌లో 1277 మంది మహమ్మారి బారిన పడ్డారు. తాజా కేసులతో.. రాష్ట్రంలో కేసుల సంఖ్య 23,902కు చేరింది. దేశంలో కేసుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానానికి చేరింది.