ప్రధాని లడఖ్ రాకతో ఆత్మరక్షణలో చైనా 

కె. రఘురామ కృష్ణంరాజు  

ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతి పెద్ద సైన్యం, అత్యాధునిక ఆయుధ సంపద, సాంకేతికత కలిగిన చైనా, యుద్ధ భూమిలో తనకు తిరుగు లేదని విర్రవీగుతూ ఉంటుంది. అయితే గల్వాన్‌ లోయ వద్ద జూన్‌ 15న నిరాయుధులుగా ఉన్న కొద్దిమంది భారత సైనికులు, వందల సంఖ్యలో ఉన్న చైనా సైనికులను మట్టికరిపించారు.

ఈ సందర్భంగా మృతి చెందిన మన సైనికులు 20 మందికి మొత్తం జాతి ఘనంగా నివాళులు అర్పించింది. ఇప్పటి వరకు తమ సైనికులు ఎంతమంది మృతి చెందారో చెప్పుకోలేని దుస్థితిలో చైనా ఉంది. 35 మంది చనిపోయారని అమెరికా నిఘా వర్గాలు, 45 మంది వరకు చనిపోయారని భారత సైనిక వర్గాలు అంటుంటే కనీసం ఖండించే ధైర్యం కూడా చేయడం లేదు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేరుగా ఘర్షణ జరిగిన ప్రాంతం సమీపానికి వెళ్లి, వారి శౌర్యపరాక్రమాలను ప్రశంసించడమే కాకుండా, వారికి మొత్తం దేశం అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. అకస్మాత్తుగా నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన సందర్భంగా చైనా పేరును ప్రస్తావించక పోయినప్పటికీ ఆ దేశ నిరంకుశ పాలకుడు జింగ్‌ పింగ్‌కు నేరుగా హెచ్చరిక వంటిది చేశారు. ‘‘విస్తరణవాదానికి కాలం చెల్లింది’’ అంటూ స్పష్టం చేసారు.

‘‘నేడు అంతా అభివృద్ధి కోసం ప్రజలు చూస్తున్నారు’’ అని తెలియచెప్పారు. కాలం మారింది గ్రహించమని చైనాకు హితవు కూడా చెప్పారు. నేడు ప్రపంచంలో అత్యంత దారుణమైన విస్తరణ కాంక్షతో వ్యవహరిస్తున్న చైనా కేవలం విస్తారమైన సరిహద్దు ఉన్న మన దేశంతోనే కాకుండా మధ్య ఆసియాలోని ఇతర దేశాలతో, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో కూడా పొరుగు దేశాలతో వివాదాలకు, ఘర్షణలకు కాలం దువ్వుతున్నది. చైనా అధినేతకు నేరుగా ఆ విధమైన హెచ్చరిక చేయగల ధైర్యాన్ని ఇప్పటి వరకు భారత అధినేతలు ఎవ్వరు ప్రదర్శింపలేదని చెప్పవచ్చు.

నరేంద్ర మోదీ లద్దాఖ్ పర్యటన సందర్భంగా చేసిన హెచ్చరికలకు చైనా తీవ్రంగా కలత చెందినట్లు ఆ వెంటనే భారత్‌లోని చైనా రాయబారి తమది విస్తరణవాదం కాదంటూ ప్రకటన ఇవ్వడంతో తేటతెల్లమైనది. చైనా విస్తరణవాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తొలి నుండి అప్రమత్తతతో ఉన్నారని చెప్పవచ్చు. ఆయన అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే జపాన్‌లో జరిపిన తొలి ద్వైపాక్షిక పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అక్కడున్న భారత పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి టోక్యోలో 2014 సెప్టెంబర్ 1న జరిపిన ప్రసంగంలో విస్తరణవాదం పట్ల హెచ్చరిక చేశారు.

‘‘18వ శతాబ్దంలో జరిగిన ఆ విస్తరణ వాదాన్ని నేడు మనచుట్టూ చూస్తున్నాము. ఒక దేశం సముద్రంలోకి, మరోవైపు ఇతర దేశాల భూభాగంలోకి ఆక్రమణకు పాల్పడడాన్ని చూస్తున్నాము. అయితే ఈ విస్తరణవాదం 21వ శతాబ్దంలో మానవాళికి ఉపయోగపడదు. నేడు కావలసింది అభివృద్ధి’’ అంటూ చైనా పేరు చెప్పకుండా తన అభిప్రాయాలను నిర్మొహాటంగా వ్యక్తపరిచారు. లద్దాఖ్ పర్యటన సందర్భంగా కూడా ఆయన అదే పనిచేశారు.

‘‘మీ పరాక్రమాన్ని మన శత్రువు, మొత్తం ప్రపంచం చూసింది’’ అని సైనికులను ఉద్దేశించి చెప్పడం ద్వారా భారత్‌పై కాలుదువ్వితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందనే స్పష్టమైన హెచ్చరికను సహితం చైనాకు చేశారు. ఇప్పటి వరకు చైనా సరిహద్దు వరకు వెళ్లి, మన సేనల నైతిక స్థైర్యాన్ని పెంపొందింప చేసే ప్రయత్నం చేయడమే కాకుండా ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలనే విధంగా సంకేతం ఇవ్వడం కూడా గతంలో భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రులు ఎవ్వరు చేయలేదు.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులలో పర్యటనలు జరిపినా, చైనా సరిహద్దులో ఘర్షణ పూర్వక వాతావరణంలో పర్యటనలు జరిపినా, చైనాకు నేరుగా హెచ్చరిక చేసిన తొలి ప్రధానిగా మోదీని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా గల్వాన్‌ ఘర్షణలో నేరుగా పాల్గొన్న సైనికులను, ఆ తరవాత చైనా సైనిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న సైనికాధికారులను కలుసుకోవడం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం ద్వారా భవిష్యత్‌లో చైనా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నా తిప్పికొట్టడం కోసం సిద్ధపడుతున్నామనే సంకేతం ఇచ్చారు.

‘‘మీరంతా జాతిని బలోపేతంగా, సురక్షితంగా ఉంచగలరని ప్రపంచంలోని ప్రతి భారతీయుడు, ముఖ్యంగా భారత దేశ ప్రజలు నేడు గ్రహించారు. మీరున్న ఈ పర్వతాల ఎత్తున్న మీ సాహసం సమున్నతమైనది. మీ చుట్టూ వున్న పర్వతాలకన్నా మీ చేతులు బలమైనవి. మీ ఆత్మవిశ్వాసం, అంకితభావం, విశ్వాసాలు పర్వత శిఖరాలకన్నా ఎత్తైనవి’’ అంటూనే వందేమాతరం నినాదం ఇచ్చి సైనికులకు మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధాని పరోక్షంగా చేసిన హెచ్చరికలు చైనాను ఆత్మరక్షణలో పడవేయడమే కాకుండా, అంతర్జాతీయంగా ఆ దేశాన్ని ఒంటరిగా చేసిన్నట్లు ఆ తరవాత జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలు భారత్‌కు సైనికంగా కూడా అండగా ఉంటామనే భరోసాను ఇచ్చాయి.

భారత దేశ భౌగోళిక సమగ్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఈ విషయంలో ఎటువంటి రాజీ ధోరణి అనుసరించే ప్రసక్తి లేదని, ఎటువంటి వత్తిడులకు సహితం లొంగే అవకాశం లేదని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని బహుముఖ అంశాలపై దృష్టి సారించినట్లు స్పష్టం అవుతుంది. ఒక వంక చైనాకు విస్పష్టమైన హెచ్చరిక చేశారు. మన సేనల నైతిక స్థైర్యం పెంపొందింప చేసే కృషి చేసారు.

మరోవంక దేశ ప్రజలను ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సంసిద్ధులను కావించే ప్రయత్నం చేశారు. తద్వారా చైనా విషయంలో గత ప్రభుత్వాల వలే మెతక వైఖరి అవలంబింపబోమని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సందర్శించిన ‘నిము’ ఘర్షణ జరిగిన గల్వాన్‌ లోయకు 200కిమీ దూరంలో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతం భారత సేనల కార్యక్రమాలకు కూడలి కావడంతో ఈ ఘర్షణను యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా భావించి తేలికగా వదిలి వేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగాలేదనే సంకేతాన్ని ఇచ్చారు.

గల్వాన్‌ లోయలో ఘర్షణ జరిగిన అనంతరం తమ సైనికులను, ఇతర స్థావరాలను వెనుకకు తీసుకు వెడతామని ఒప్పుకున్నప్పటికీ చైనా వెళ్లిన్నట్లే వెళ్లి మళ్ళీ ముందుకు వచ్చింది. అయితే ప్రధాని మోదీ ‘నిము’ వెళ్లిన మూడు రోజులకు చెప్పాపెట్టకుండా గల్వాన్‌, గోగ్రా నుంచి చైనా బలగాలు తిరుగుముఖం పట్టాయి. టెంట్లు తొలగించడంతో పాటు తమ వాహనాలను కూడా వెనక్కు తీసుకువెళ్ళాయి.

ప్రధాని మోదీ హెచ్చరికల ప్రభావాన్ని ఈ పరిణామాలు వెల్లడి చేస్తున్నాయి. భారత దేశం శాంతికి కట్టుబడి ఉంటుందని చెబుతూనే అందుకు బలంగా ఉండడం అవరమని పేర్కొంటూ చైనాకు దీటుగా అడుగులువేస్తామనే స్పష్టమైన సంకేతం నరేంద్ర మోదీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి ఉదాహరణ తీసుకు రావడం గమనార్హం. వేణునాదం చేస్తూ ఒక వంక శాంతి సందేశం ఇస్తూనే, మరోవంక అవసరమైనప్పుడు సుదర్శన చక్రం ఉపయోగించి దుర్మార్గులను శ్రీ కృష్ణుడు వధించారని నరేంద్ర మోదీ గుర్తుచేసారు.

(నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు, చైర్మన్‌, సబ్‌ఆర్డినేట్‌ లేజిస్లేషన్)‌

(ఆంధ్రజ్యోతి నుండి)