
గాల్వన్ లోయలో భారతీయ సైనికులతో ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం చైనా దళాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. వివాదాస్పదంగా మారిన ప్రాంతం నుంచి రెండు దేశాలు తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. జూన్ 15వ తేదీన ఎక్కడైతే ఘర్షణ జరిగిందో ఆ కీలక ప్రాంతం నుంచి చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది.
20 మంది సైనికులు చనిపోయిన ప్రదేశం వద్ద భారత్ ఇటీవల భారీగా బలగాలను మోహరించింది. బంకర్లు, తాత్కాలిక టెంట్లను నిర్మించింది. ఓ దశలో రెండు దేశాల సైనికులు.. ఎదురెదురుగా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉత్కంఠ నెలకొన్నది. జూన్ 30వ తేదీన జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చల ఒప్పందం ప్రకారం గాల్వన్ లోయ వద్ద సర్వే చేపట్టారు.
ఒప్పందాలకు తగినట్లు చైనా వెనక్కి తగ్గిందా లేదా అన్న సర్వే జరిగినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తంగా ఉన్న గాల్వన్, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ ప్రదేశాల నుంచి సైనికులను వెనక్కి పంపాలని జూన్ 30వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు మరోసారి వివాదాస్పద అంశాల గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద నుంచి చైనా సైనిక దళాలు టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి కొన్ని వాహనాలను కూడా చైనా వెనక్కి తీసుకువెళ్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పాయింట్ 14 వద్దే.. చైనా, భారత సైనిక దళాలకు ఘర్షణ జరిగింది. అక్కడే 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
గాల్వన్‌తో పాటు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి పీఎల్ఏ తమ దళాలను ఉపసంహరిస్తూ కనిపించిందని తెలిపారు. పాన్‌గాంగ్ సో వద్ద ఉన్న ఫింగర్ 4 నుంచి కూడా కొన్ని టెంట్లను తీసివేశారు. ప్రస్తుతం చైనాతో నెలకొన్న ప్రతిష్టంభనలో పాన్‌గాంగ్ సో కూడా కీలక ప్రాంతంగా మారింది. ఫింగర్ 4 వద్ద పీఎల్ఏ దళాలు 8 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చారు. ఎల్ఏసీ అలైన్‌మెంట్ ప్రకారం.. ఫింగర్ 8 వరకు తమదే అని భారత్ పేర్కొంటున్నది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. 38 మంది మావోలు మృతి
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత