ప్రభాస్ ఝా
దేశంలో ప్రతి సంవత్సరం చాలా మంది జయంతులు, వర్దంతిలను జరుపుతూ ఉంటాము. అయితే ధర్మ బద్దమైన వారు చాలా అదృష్టవంతులు. వారి మద్దతు దారులు లేదా అనుచరులు వారి “త్యాగాలు”ను అర్ధవంతం కావిస్తారు. డా. శ్యామ్ ప్రసాద్ ముఖేర్జీ అటువంటి మహోన్నతమైన నేత. భారత సమగ్రత కోసం తన జీవితంను 1953 జూన్ 23న త్యాగం చేశారు.
భారతీయ జనసంఘ్ రోజుల నుండి, నేటి వరకు కూడా జూన్ 23ని డా. ముఖేర్జీ బలిదీనంగానే కాకుండా రాజ్యాంగం నుండి ఆర్టికల్ 370ని తొలగించేందుకు అంకితమయ్యే రోజుగా జరుపుతూ వస్తున్నాము. ప్రతి ఎన్నికల ప్రణాళికలో డా. ముఖేర్జీ కోరిన విధంగా తాత్కాలికమైన ఆర్టికల్ 370ని తొలగించడం పట్ల విశ్వాసాన్ని ప్రకటిస్తుంటాము.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని ప్రతిజ్ఞ తీసుకొంటూ డా. మురళి మనోహర్ జోషితో కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రయాణించి 1992లో శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద మూడురంగుల జెండాను ఎగురవేశారు. చివరకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370ని ఆగష్టు 5, 2019న రద్దు చేశారు. ఈ చారిత్రాత్మక బిల్ ను పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదించేటట్లు చేయడంలో హోమ్ మంత్రి అమిత్ షా నిజమైన దేశభక్తుడిగా వ్యవహరించారు.
విద్య, రాజకీయ, సామజిక, సాంస్కృతిక రంగాలలో సహితం డా. శ్యామా ప్రసాద్ ముఖేర్జీ గణనీయమైన సేవలు అందించారు. 1929లో బెంగాల్ శాసన సభ సభ్యుడై, అతి చిన్న వయస్సులో 1934 నుండి 1938 వరకు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవిని అధిష్టించారు. ఆ తర్వాత బెంగాల్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి అయ్యారు.
తదుపరి, అఖిల భారత హిందూ మహాసభ, మహాబోధి సొసైటీ, రాయల్ ఆసియాస్టిక్ సొసైటీ లకు జాతీయ అధ్యక్షులు అయ్యారు. రాజ్యాంగ సభ సభ్యునిగా కూడా ఉన్నారు. స్వతంత్ర భారత్ లో మొదటి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం కూడా ఆయనకు లభించింది. మొదటి సాధారణ ఎన్నికలలో దక్షిణ కలకత్తా నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు.
డా. ముఖేర్జీ దేశ విభజనను కోరుకోలేదు. పండిట్ నెహ్రు అందుకు అనుకూలంగా ఉన్నారు. దానితో నెహ్రూను ఒప్పించమని కోరడం కోసం మహాత్మా గాంధీని వెళ్లి కలిశారు. అయితే కాంగ్రెస్ తన మాట వినడం లేదని ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారు. దేశ విభజన అనివార్యమని స్పష్టం కావడంతో, బెంగాల్ లోని హిందువుల ప్రయోజనాలు కాపాడటం కోసం కంకణం కట్టుకున్నారు. అందుచేతనే బెంగాల్ ను పాకిస్తాన్ లో విలీనం చేయాలనే ముస్లిం లీగ్ పన్నాగం ఫలించలేదు.
నిర్వాసితుల పట్ల పండిట్ నెహ్రు విముఖత, జాతీయ ప్రయోజనాల పట్ల తన అంకితభావంను దృష్టిలో ఉంచుకొని 1950 ఏప్రిల్ 8న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల నెహ్రూ మెతక వైఖరి అవలంభిస్తున్నారని, పశ్చిమ పాకిస్తాన్ (నేటి పాకిస్థాన్), పశ్చిమ పాకిస్థాన్ (నేటి బాంగ్లాదేశ్)లలోని హిందువుల ప్రయోజనాలు కాపాడటంకు భరోసా ఇచ్చే ధైర్యం ఆయనకు లేదని గ్రహించారు.
మైనారిటీల ప్రయోజనాలు కాపాడే బాధ్యతను భారత ప్రభుత్వంపై ఉంచి, పాకిస్థాన్ అటువంటి బాధ్యత తీసుకొనని నెహ్రు – లిఖాయత్ ఒప్పందం అర్ధం లేనిదని భావించారు. నెహ్రు మంత్రి వర్గం నుండి రాజీనామా చేసిన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. ఆర్ ఎస్ ఎస్ ద్వితీయ సర్ సంఘ్ చాలక్ ఎం ఎస్ గోళాల్వాకర్ (గురూజీ)ని కలిసి భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్న గురూజీ అందుకోసం ఆర్ ఎస్ ఎస్ నుండి ఎనిమిది మంది ప్రచారక్ లను ఇచ్చారు. నెహ్రు చేసిన పొరపాట్లను సరిదిద్దే ఉద్దేశ్యంతో జనసంఘ్ ను ప్రారంభించారు. అక్టోబర్ 21, 1951న డా. ముఖేర్జీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జనసంఘ్ ప్రారంభమైనది.
అక్టోబర్ 25, 1951 నుండి ఫిబ్రవరి 21, 1952 వరకు జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో జనసంఘ్ నుండి ముఖేర్జీతో పాటు ముగ్గురు లోక్ సభకు ఎన్నికయ్యారు. సభలో చర్చల సందర్భంగా నెహ్రు విధానాలను ముఖేర్జీ వ్యతిరేకిస్తూ ఉండేవారు.
ఒక సారి ముఖేర్జీని చూస్తూ “జనసంఘ్ మత పార్టీ. దానిని నేను అణచివేస్తాను” అంటూ నెహ్రు ఆగ్రహంగా పేర్కొన్నారు. “నా స్నేహితుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రు జనసంఘ్ ను అణచివేస్తాను అని చెబుతున్నారు. నేను ఈ అణచివేత మస్తత్వాన్ని అణచివేస్తాను అని చెబుతున్నాను” అంటూ సున్నితంగా ముఖేర్జీ తిప్పి కొట్టారు.
కాశ్మీర్ కు ప్రత్యేక హోదా యివ్వడం వల్లన జరిగే ప్రమాదం గురించి ఇతరులు తర్వాత గ్రహించగా, డా. ముఖేర్జీ మొదటి నుండే అర్ధం చేసుకున్నారు. ఆ తర్వాత కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదం, అత్యాచారాలు, హిందువుల వలసలు వంటి ప్రమాదాల గురించి 1952లో లోక్ సభ చర్చలలో డా. ముఖేర్జీ ముందుగానే హెచ్చరిస్తూ ఉండేవారు. 1952 నాటికి షేక్ అబ్దుల్లా వేర్పాటువాద ధోరణులు ప్రారంభం కావడంతో అక్కడ జాతీయత భావనకు అంతరాయం ఏర్పడింది.
జమ్మూ, కాశ్మీర్ ను భారత్ లో సంపూర్ణ భాగంగా కావించాలని కోరుతూ ప్రజా పరిషద్ చేపట్టిన సత్యాగ్రహకు డా. శ్యామా ప్రసాద్ ముఖేర్జీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారికి మద్దతుగా “ఒక దేశంలో రెండు జెండాలు, ఒక దేశంలో రెండు శాసన సభలు, ఒక దేశంలో ఇద్దరు అధినేతలు ఆమోదయోగ్యం కాదు” (ఏక్ దేశ్ మెయిన్ దో నిశాంత్, ఏక్ దేశ్ మెయిన్ దొ విధాన్ , ఏక్ దేశ్ మెయిన్ దో ప్రధాన్ నహి ఛలేంగే, నహి చలేంగే) అంటూ నినాదం ఇచ్చారు. ఆగష్టు, 1952న జమ్మూలో జరిగిన బ్రహ్మాండమైన ప్రదర్శనలో “నేను మీకు భారత రాజ్యాంగ ఇవ్వనైనా ఇస్తాను లేదా అందుకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తాను” అంటూ ప్రకటించారు.
ఈ లక్ష్య సాధన కోసమే నెహ్రు ప్రభుత్వాన్ని ఢిల్లీలో, అబ్దుల్లా ప్రభుత్వాన్ని శ్రీనగర్ లో సవాల్ చేయాలని ముఖేర్జీ నిర్ణయించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం మే, 1953లో వెళ్లారు. ఆ రోజులలో జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించడానికి అనుమతి పొందవలసి ఉంటుంది.
పర్మిట్ ఉందా అని అడిగితే, “నేను భారత పార్లమెంట్ సభ్యుడిని. నా సొంత దేశంలోని కాశ్మీర్ కోసం పర్మిట్ తీసుకోను” అని స్పష్టం చేశారు. దానితో ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. 40 రోజుల పాటు ఆయనకు వైద్య సంరక్షణ గాని, కనీస సదుపాయాలు గాని కల్పించలేదు. అనుమానాస్పద పరిస్థితులలో ఆయన జూన్ 23న మృతి చెందారు. తన లక్ష్య సాధనకోసం, మాతృదేశం కోసం తన జీవితాన్ని బలిదానం చేసుకున్నారు.
ఆయనతో పాటు కాశ్మీర్ కు వెళ్లిన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి ఈ విధంగా వ్రాసారు: “ఆయన చనిపోయినప్పుడు డా ముఖేర్జీ చెబుతున్నట్లున్నది. ఆయన ఆత్మ ఆకాశం నుండి చెబుతున్నట్లున్నది… చూడండి మృతవీరుడిగానైనా నేను జమ్మూ, కాశ్మీర్ నుండి వచ్చాను. వారు నన్ను నిర్బంధంలో ఉంచలేక పోయారు’. డా. ముఖేర్జీ కలలు నెరవేర్చడం కోసం తన జీవితం అంతా అంకితం చేసుకొంటానని వాజపేయి ప్రతిజ్ఞ తీసుకున్నారు.
స్వతంత్ర భారత దేశంలో జాతీయ ఐక్యత, సమగ్రతల కోసం జరిగిన పోరాటంలో డా. ముఖేర్జీ జరిపిన బలిదానం మొదటి బలిదానం. కోలకత్తాలో ఆయన అంత్యక్రియలకు నివాళులు అర్పించడం కోసం సుమారు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. డా. ముఖేర్జీ ప్రతిజ్ఞ జాతి తీర్మానంగా మారింది. దేశ ప్రజల కోసం ఆర్టికల్ 379ని రద్దు చేయడం కోసం ప్రతిజ్ఞగా ఆయన బలిదానం మారింది.
ఈ 70 సంవత్సరాల కార్యాన్ని మోదీ ప్రభుత్వం తాను రెండో సారి అధికారమలోకి రాగానే 70 రోజులలో నెరవేర్చింది. జమ్మూ కాశ్మీర్ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మొదటి భారతీయుడు డా. ముఖేర్జీ. మహోన్నత త్యాగం జరిపిన జూన్ 23ని దేశంలో `ఏక్ నిషాన్, ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్ దినం”గా జరపాలి. ప్రతి సంవత్సరం ఆయన బలిదానం చేసిన రోజును జాతి ఆయనను గుర్తు చేసుకోవడమే కాకుండా జాతీయ ఐక్యత, సమగ్రతల స్ఫూర్తిని కూడా బలోపేతం కావింపవలసి ఉంది.
(రచయిత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు)
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’