
హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లోని కొవిడ్ పడకల్లో సగం రాష్ట్ర ప్రభుత్వం తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. వాటి కేటాయింపులో పారదర్శకత కోసం ఒక యాప్‌ను తీసుకురానుంది. దీనివల్ల ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో తెలిసిపోతుంది.
సర్కారు నిర్దేశించిన ధరలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలనుకునే వారు ఈ యాప్ ద్వారా పడకలను పొందవచ్చు. మిగిలిన 50 శాతం పడకలను ఆసుపత్రుల యాజమాన్యాలు తమ ఇష్టానుసారం కేటాయించుకోవచ్చు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సగం పడకలు తమ పర్యవేక్షణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించగా కార్పొరేట్ ఆసుపత్రులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తున్నది.
హెచ్‌ఎంసీ పరిధిలోని సుమారు 25 కార్పొరేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సలు జరుగుతున్నాయి. వాటిలో కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి, పాజిటివ్ వచ్చినవారికి, ఐసీయూలో చికిత్స అందించాల్సినవారికి, వెంటిలేటర్‌పై చికిత్స ఇవ్వాల్సిన వారికి.. ఇలా వేర్వేరు విభాగాలుగా పడకలను ఏర్పాటుచేశారు.
ఒక్కో కార్పొరేట్ ఆసుపత్రిలో 300 నుంచి 800 వరకూ పడకలుండగా వాటిలో 20 నుంచి 30 శాతం కొవిడ్ బాధితుల కోసం కేటాయించారు. వాటిలోనూ సాధారణ ఐసోలేషన్ పడకలు తక్కువగా కేటాయించి, ఐసీయూ పడకలను ఎక్కువగా కేటాయించారు. ఆ విధంగా కరోనా రోగుల నుండి ప్రభుత్వ ఆంక్షలను పట్టించుకోకుండా భారీగా చార్జీలు వసూలు చేస్తున్నారు.
వాటిని కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఇప్పుడు సగం పడకలను తీసుకున్నా వారికి ఇతర సేవల పేరుతో చార్జీలు వసూలు చేసే అవకాశం ఉండడమే కాకుండా, మిగిలిన పథకాలకు అంతులేని చార్జీలు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చిన్నట్లు అయ్యే అవకాశం ఉంది.
More Stories
ఎన్డీఏలో చేర్చుకోమని కేసీఆర్ వెంటబడ్డారు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ
అక్టోబర్ 2వ వారంలో బీజేపీ అభ్యర్థుల జాబితా