ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యురాలి నిర్బంధం 

హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా రోగులను గగుర్పాటు కలిగించే బిల్లులతో వేధిస్తున్నాయి. తాజాగా  కరోనాకు గురైన ఒక ప్రభుత్వ వైద్యురాలినే బిల్లు చెల్లించలేదని నిర్బంధించారు. 
 

ఫీవర్‌ ఆస్పత్రిలో డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుల్తానాకు కరోనా వైరస్‌ సోకడంతో 1వ తేదీ అర్ధరాత్రి చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆమె అడ్వాన్స్‌గా రూ.40 వేలు చెల్లించారు. అయితే, అక్కడ మెరుగైన వైద్యం లభించడం లేదని భావించిన ఆమె ఆస్పత్రినుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.

3వ తేదీ ఉదయం వరకు వైద్యం అందించినందుకుగాను రూ.1.15 లక్ష లు కట్టాలంటూ ఆస్పత్రి సిబ్బంది బిల్లు వేశారు. తాను అంత చెల్లించలేనని తగ్గించాలని ఆమె కోరారు. అయితే మొత్తం బిల్లు కట్టాలని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆ డబ్బులు కట్టేవరకు డిశ్చార్జి చేయబోమని తేల్చి చెప్పాయి. అప్పటి నుంచి తనకు చికిత్స అందించడం లేదని, ఎవరూ పట్టించుకోలేదని సుల్తానా తెలిపారు.

 తాను మధుమేహంతో ఇబ్బంది పడుతున్నానని, కనీసం ఇన్సులిన్‌ ఇవ్వలేదని, ఆహారం ఇవ్వలేదని వాపోయారు. 4వ తేదీ నాటికి బిల్లును మరింత పెంచి రూ.1.47 లక్షలు కట్టాలన్నారని ఆమె వివరించారు. చివరకు ఆస్పత్రి వర్గాలను బతిమాలిడితే మొత్తం 1.30 లక్షలు కడితే  అప్పుడు డిశ్చార్జి చేశారని.. ఆదివారం ఉదయం ఇంటికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు.