తెలంగాణ ప్రభుత్వం పట్టింపులేని తీరుతో కరోనా వ్యాప్తి పెరిగిపోతోందని, హైదరాబాద్ ఎప్పుడు కరోనాతో బ్లాస్ట్ అవుతుందో తెలియక జనంలో అయోమయం, ఆందోళన నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వక్తం చేశారు. హైదరాబాద్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు వస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని మండిపడ్డారు.
శనివారం బీజేపీ హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ప్రాంతీయ జన్ సంవాద్ వర్చువల్ ర్యాలీలో ప్రసంగిస్తూ పాలించే పెద్దలే ఫాంహౌజ్ లో ఉంటే ఇక జనం ఎక్కడికి పోవాలని, వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. రెండు సెంట్రల్ టీంలు హైదరాబాద్ లో పరిస్థితిని పరిశీలించి, సూచనలు చేస్తే రాష్ట్ర సర్కారు పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.
కరోనా నుంచి సర్కారు కాపాడుతుందనే ఆశలు పోయాయని చెబుతూ ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జనం ఇండ్లనుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వపరంగా లోపాలు ఉండటం వల్లే కరోనాను కట్టడి చేయలేకపోతున్నారని పేర్కొంటూ అధికారులు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా ప్రగతి భవన్ లో నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, కానీ టీఆర్ఎస్ సర్కారు ఒంటెద్దు పోకడలతో కరోనాను కంట్రోల్ చెయ్యలేకపోయిందని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి రెండున్నర లక్షల పీపీఈ కిట్లను, ఆరున్నర లక్షల మాస్కులు, 22 లక్షల టాబ్లెట్లను ఇచ్చిందని వివరించారు. కేంద్రం ఇంత చేసినా టీఆర్ఎస్ సర్కారు నిందలు వేస్తోందని దుయ్యబట్టారు. ఒక ల్యాబ్ లో టెస్టులు చేస్తే 71 శాతం మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెబుతూ మరి ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.
More Stories
తుది దశకు చేరుకున్న వామపక్ష తీవ్రవాదం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య పోరుకు ఏడాది పూర్తి
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా గద్దలతో ‘ఈగల్ స్కాడ్’