భారత్ కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంస 

భారత్ కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంస 
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భారత దేశం మరోసారి  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రశంసలు అందుకుంది. ఈ మహమ్మారికి సంబంధించిన యావత్తు సమాచారాన్ని సేకరించి, నిర్వహించాలని డబ్ల్యూహెచ్ఓ సలహా ఇచ్చింది. 
భారత దేశానికి అతి పెద్ద సవాలు జనాభాయేనని తెలుపుతూ  భౌగోళిక వైవిద్ధ్యంతోపాటు ప్రతి రాష్ట్రంలోనూ అనేక మహమ్మారులు ఉన్నాయని పేర్కొంది. రోగ నిర్థరణ సామర్థ్యాన్ని పెంచుకోవడం, అష్ట దిగ్బంధనం విధించడం, అష్ట దిగ్డంధనంలో సడలింపులు విధించడం వంటివి వ్యవస్థీకృత పద్ధతుల్లో జరుగుతున్నాయని కొనియాడింది. 

వీటిపై దృష్టి పెట్టిన భారత ప్రభుత్వ బలమైన నాయకత్వం ప్రశంసనీయమైనదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్  సౌమ్య స్వామినాథన్ ప్రశంసించారు.  ప్రస్తుతం కోవిడ్ మహమ్మరి తదుపరి దశను భారత దేశంతోపాటు చాలా ఇతర దేశాలు ఎదుర్కొంటున్నాయని, దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి సారిచాలని సూచించింది. 

భారత దేశం ప్రారంభం నుంచి చాలా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతోందని చెబుతూ డబ్ల్యూహెచ్ఓ సిఫారసుల మేరకు జనవరి నుంచే కొన్ని చర్యలను అమలు చేసిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో రోజుకు 2 లక్షల కోవిడ్ పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

గత రెండు నెలల్లో టెస్టింగ్ కిట్ల విషయంలో భారత దేశం స్వయంసమృద్ధమైందనికొనియాడారు. ఇది గొప్ప విజయమని తెలుపుతూ భవిష్యత్తులో ఈ టెస్టింగ్ కిట్ల సంఖ్యను పెంచే సామర్థ్యం భారత దేశానికి ఉందని చెప్పారు. 

అయితే డేటాపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉందని డాక్టర్ సౌమ్య సూచించారు. డేటాను పద్ధతి ప్రకారం పరిశీలించవలసి ఉంటుందని ఆమెపేర్కొన్నారు. కేసుల సంఖ్య, మరణాల సంఖ్య చెప్పడం వల్ల కొన్ని వివరాలు మాత్రమే తెలుస్తాయని చెప్పారు. 

డేటాను ఏ విధంగా రిపోర్టు చేయాలనేదానిపై జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం లేకపోతే వివిధ అంశాలను పోల్చి చూడటం సాధ్యం కాదని ఆమె చెప్పారు. 

కోవిడ్-19పై మాత్రమే కాకుండా ఇతర వ్యాధుల పట్ల కూడా భారత దేశం శ్రద్ధ చూపాలని డా. సౌమ్య సూచించారు. క్షయ వ్యాధి, సంస్థాగత ప్రసవాలు, ఎంపిక చేసుకున్న శస్త్ర చికిత్సలు వంటివి కోవిడ్ కన్నా తీవ్రమైనవని ఆమె పేర్కొన్నారు. వీటిపై కూడా భారత ప్రభుత్వం దృష్టిపెట్టాలని చెప్పారు.