
బుద్ధ భగవానుడి బోధనలను అనుసరించడం ద్వారా ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న అనేక సమస్యలు, సవాళ్లను దీటుగా ఎదుర్కోవచ్చని దేశ ప్రజలు, యువతకు ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. శనివారం ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ సందర్భంగా మోడీ బుద్ధుడి పలు బోధనలను గురించి చెప్పారు.
‘ప్రస్తుతం ప్రపంచం అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ చాలెంజ్‌లకు దీర్ఘ కాల పరిష్కారాలు బుద్ధ భగవానుడి ఆదర్శాలతోనే సుసాధ్యం అవుతుంది. ఆ బోధనలు గతానికి ఆచరణీయంగా ఉన్నాయి. అలాగే వర్తమానంలోనూ అనుసరణీయమైనవే. భవిష్యత్తులోనే ఆచరించాల్సినవే’ అని చెప్పుకొచ్చారు.
21వ శతాబ్ధం పట్ల తాను విశ్వాసంతో ఉన్నానని, తన యువ స్నేహితులతో ఈ ఆశావాహ దృక్ఫథంతో ఉన్నట్లు ప్రధాని తెలిపారు. విశ్వసమస్యలకు యువ మేధావులు పరిష్కరాలు వెతుకుతున్నారని, భారత్‌లో అతిపెద్ద స్టార్ట్ అప్ వ్యవస్థ ఉన్నదని, యువత మిత్రులంతా బుద్ధుడి బోధనలను అనుసరించాలని ప్రధాని మోదీ సూచించారు.
చురుకైన యువ మెదళ్లు ప్రపంచ సమస్యలకు సమాధానాలు కనుగొనే యత్నం చేస్తున్నాయని పేర్కొంటూ ఎక్కువ స్థాయిలో స్టార్టప్ ఎకో సిస్టమ్ కలిగిన దేశంగా భారత్ ను చెప్పవచ్చని తెలిపారు. ఆశ, ఆవిష్కరణ, కరుణ ఎలా సమస్యలను పరిష్కరిస్తాయో తెలుసుకోవాలంటే, యువత మొదలుపెట్టిన స్టార్ట్ అప్‌ల గురించి తెలుసుకోవాలని పేర్కొన్నారు.
గౌతమ బుద్ధుడు సర్‌నాథ్‌లో చేసిన తొలి బోధనల గురించి మోదీ ప్రస్తావిస్తూ బౌద్ధమతం మర్యాదను నేర్పిస్తుందని, ప్రజలను ఎలా గౌరవించాలి, పేదలను ఎలా గౌరవించాలి, మహిళలను ఎలా గౌరవించాలి, శాంతి, అహింసను ఎలా గౌరవించాలన్న అంశాలను నేర్పుతుందని వివరించారు. అందుకే బుద్ధుడి బోధనలు భూగ్రహ సమగ్ర రక్షణకు మేలైన అంశాలని చెప్పారు.
బుద్ధుడి ఎనిమిది బోధనలు.. సమాజం, దేశాల పురోగతికి దోహదపడుతుందన్నారు. ఆలోచనలో, ఆచరణలో బుద్ధుడి బోధనలు చాలా సింపుల్‌గా ఉంటాయని ప్రధాని తెలిపారు. బౌద్ధ పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతూ కొద్దీ రోజుల క్రితమే కేంద్ర మంత్రివర్గం ఖుషీనగర్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించినట్లు ప్రధాని గుర్తు చేశారు. ఇది కార్యరూపం దాల్చితే అనేక మంది ప్రజలు, యాత్రికులు, భక్తులు సందర్శనకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
More Stories
దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం
జాతీయ భద్రతా సలహా బోర్డు పునరుద్ధరణ
పాకిస్థాన్ ను నాలుగు దేశాలుగా విడగొట్టాలి!