టిక్  టాక్ పై నిషేధం వెనుక ఆర్ ఎస్ ఎస్ 

చైనా యాప్ టిక్ టాక్ ను మరో 50కు పైగా చైనా యాప్ లతో కలిపి గాల్వన్ లోయ వద్ద చైనా సేనలతో జరిగిన ఘర్షణ అనంతర పరిస్థితులలో  భారత ప్రభుత్వం నిషేధం విధించడం యాదృచ్చికంగా జరగలేదని తెలుస్తున్నది. టిక్ టాక్ పై నిషేధం విధించాలని రెండేళ్లుగా ఆర్ ఎస్ ఎస్, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న కృషి ఫలితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణకు దిగవలసి వచ్చిన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. 
 
భారత భద్రత వ్యవస్థలో చైనా యాప్ ల ప్రమాదం గురించి   గత ఏడాది జైపూర్ లో జరిగిన వార్షిక సమావేశాలలో ఆర్ ఎస్ ఎస్ తొలిసారిగా భారత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆ తర్వాత మంగళూరులో జరిగిన విశ్వ హిందూ పరిషద్ సమావేశంలో కూడా చర్చించారు. తదుపరి హరిద్వార్ లో గత ఏడాది జరిగిన   స్వదేశీ జాగరణ్ మంచ్ వార్షిక సమావేశంలో ఈ విషయమై చాలా లోతుగా అధ్యయనం జరిపారు. 
 
ఈ యాప్ లపై నిషేధం విధించిన తర్వాత ఆన్ లైన్ మీడియా, ఓటిటి, టెలికాం మౌలిక సదుపాయాలు, సున్నితత్వం లేని స్థానిక యాప్ నిర్మాతలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని స్వదేశీ జాగరణ్ మంచి, ఇతర ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అంతే కాదు ఈ యాప్ ల రద్దుతో ఎదురయ్యే న్యాయసంబంధ అంశాలను సహితం వీరు పరిశీలన చేస్తున్నారు. 
 
“భారత సామజిక, జాతీయ భద్రతా” అంశాలను బలోపేతం చేయడం కోసం అన్ని రకాల ఆన్ లైన్ మీడియా, యాప్ లు, ప్రధానంగా ఓటిటి వేదికలను బలోపేతం చేయాలని ఆర్ ఎస్ ఎస్ సాంస్కృతిక విభాగం సంస్కార భారతి గత వారం పిల్పుపిచ్చింది. భారత టెలికాం, సైబర్ మౌలిక సదుపాయాలతో చైనా చొరబాటుల గురించి ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థలైన విజ్ఞాన్ భారతి, రీసెర్చ్ అండ్ రెసర్జన్స్ ఫౌండేషన్లు నిర్దుష్ట అధ్యనాలను జరుపుతున్నట్లు తెలుస్తున్నది. 
 
ముఖ్యంగా గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు  మృతి చెందిన సంఘటన అనంతరం చైనా యాప్ ల ద్వారా ఎదురవుతున్న ప్రమాదాల గిరినుంచి  ఆర్ ఎస్ ఎస్ సంస్థలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నాయి. 
 
గత ఏడాది కనీసం రెండు పార్లమెంటరీ కమిటీ సమావేశాలలో టిక్ టాక్ గురించి ఎంపీలు ప్రశ్నలు వేశారు. సైబర్ క్రైమ్, పోర్నోగ్రఫీ, సైబర్ బుల్లియింగ్, రక్షిత ఆన్ లైన్ ప్రవర్తన లకు సంబంధించిన ఈ కమిటీలలో కేవలం బిజెపి సభ్యులే కాకుండా  కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, టిడిపి నేత గళ్ళ జయదేవ్, బిజెడి ఎంపీ పినాకి మిశ్రా వంటివారు సహితం  ఈ యాప్ ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఈ విషయమై సుప్రీం కోర్ట్ లో ఒక కేసు ప్రస్తుతం నడుస్తుండగా, జాతీయ మహిళా కమీషన్, జాతీయ బాలల వేధింపుల నివారణ కమీషన్, జాతీయ ఎసి కమీషన్ ముందు కూడా ఇటువంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. టిక్ టాక్ యాప్ ను నిషేధించమని సూచిస్తూ జాతీయ మహిళా కమీషన్ అధ్యక్షురాలు రేఖ శర్మ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాసారు.