ఢిల్లీ అల్లర్ల వెనుక  జాకీర్ నాయ‌క్‌!

ఢిల్లీ అల్లర్ల వెనుక  జాకీర్ నాయ‌క్‌!
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంకు వ్యతిరేకంగా గ‌త ఫిబ్ర‌వ‌రిలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక మత బోధకుడు జాకీర్ నాయక్ ప్రమేయం ఉందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిబ్రవరి 24న‌ ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ స‌వ‌ర‌ణ‌ చట్టం మద్ధతుదారులు, వ్య‌తిరేకుల మ‌ధ్య హింస చెలరేగింది. ఇది మత ఘర్షణలకు దారితీసింది. 

ఈ అల్లర్ల కేసులో అరెస్ట‌యిన‌ ఖలీద్ సైఫీ గతంలో మలేషియాలో ఇస్లాం మత బోధకుడు జాకీర్ నాయక్‌ను కలిసినట్లు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల‌ దర్యాప్తులో వెల్లడైంది. ఖలీద్ సైఫ్‌కు అల్లర్లకు కారణమైన ఉమర్ ఖలీద్, తాహిర్ హుసేన్‌ల‌తో సంబంధాలున్నాయని పోలీసులు చెప్పారు. 

సౌదీ అరేబియాతోపాటు సింగపూర్‌కు చెందిన ఓ ఎన్నారై నుంచి వారికి నిధులు వచ్చాయని పోలీస్ విచార‌ణ‌లో తేలింది. ఘజియాబాద్ కాంగ్రెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రత్ జహాన్‌కు మహారాష్ట్రలోని బంధువుల ద్వారా రహస్యంగా నిధులు వచ్చాయని తేలడంతో ఆమెను ఢిల్లీ పోలీసులు మార్చి నెలలో అరెస్టు చేశారు. 

అయితే, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఖలీద్ సైఫీ, ఇష్రత్ జహాన్‌ల‌ విచారణ పెండింగులో ఉన్న‌ది. ఖలీద్ సైఫీకి సింగపూర్ నుంచి వచ్చిన ఎన్నారై ఖాతా ద్వారా అల్లర్ల కోసం నిధులు అందాయ‌ని దర్యాప్తులో తేలింది. ఈ డబ్బును నిర్బంధంలో ఉన్న ఉమర్ ఖలీద్, అతని మీరట్ భాగస్వామి నడుపుతున్న ఒక స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేశారు. 

నిధులు బ‌దిలీ చేసిన‌ సింగపూర్ ఎన్నారైని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఖలీద్ సైఫీ మొబైల్ నుంచి డబ్బు బదిలీలకు సంబంధించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. 

జాకిర్ నాయక్ దేశంలో మత సమరస్యంకు విఘాతం కలిగించడంతో పాటు, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పలు కేసులు ఎదుర్కొంటున్నారు. దేశం నుండి పరారై ప్రస్తుతం మలేసియాలో ఆశ్రయం పొందారు. అతనిని భారత్ కు అప్పచెప్పమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మలేసియా ప్రధానిని కోరారు.