భారత్ లో టెస్ట్ చేయించుకున్న ప్రతి వంద మందిలో ఏడుగురికి కరోనా సోకినట్లు తేలితే., తెలంగాణలో మాత్రం టెస్టులు చేసిన ప్రతి వంద మందిలో 19 మందికి పాజిటివ్ వస్తోంది. మహారాష్ట్ర (18.24 శాతం), ఢిల్లీ (16.10 శాతం) తప్ప మరే రాష్ట్రమూ మన దరిదాపుల్లో లేదు. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ అతి తక్కువ పాజిటివ్ రేటుతో కింది నుంచి మొదటి స్థానంలో ఉంది. కానీ టెస్టుల సంఖ్యలో మాత్రం టాప్‌లో 3లో ఉంది.
కాగా, టెస్ట్ లలో తెలంగాణ చివరినుండి మొదటి స్థానంలో ఉంది. దేశంలో గురువారం నాటికి 92,97,749 మందికి కరోనా టెస్టులు చేస్తే, తెలంగాణలో 98,153 మందికి మాత్రమే టెస్ట్ చేశారు. గోవా, మణిపూర్ ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ వంటి చిన్న రాష్ట్రాల్లో మాత్రమే టెస్టుల సంఖ్య మనకంటే తక్కువగా ఉంది. అక్కడ కేసుల సంఖ్య వందల్లోనే ఉన్నా టెస్టుల సంఖ్య వేలల్లో ఉంది.
15 వేల కంటే ఎక్కువ కేసులు నమోదైన అన్ని రాష్ట్రాల్లోనూ టెస్టుల సంఖ్య 3 లక్షలు దాటింది. తెలంగాణలో మాత్రం టెస్టుల సంఖ్య లక్ష దగ్గరే ఆగిపోయింది.
ఇక రికవరీ రేట్‌లోనూ దేశ సగటు కంటే తెలంగాణ వెనకబడింది. ఇండియాలో కరోనా బారిన పడిన ప్రతి వంద మందిలో 60 మంది కోలుకోగా, తెలంగాణలో ప్రతి వంద మందిలో 49 మంది మాత్రమే డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క కర్నాటక (46) తప్ప, మిగిలిన అన్ని రాష్ట్రాలు రికవరీలోనూ తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్నాయి.
వైరస్ సోకినా లక్షణాలు లేకపోతే, పది రోజుల తర్వాత వారిని కోలుకున్న వారి జాబితాలో చేర్చాలి. కానీ తెలంగాణలో వైరస్ సోకిన ఏడెనిమిది రోజుల్లోనే వందల మందిని రికవరీ లిస్ట్‌లో చేర్చుతున్నారు. లేకుంటే రికవరీ రేట్ ఇంకా తక్కువగానే ఉండే అవకాశం ఉంది.
More Stories
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం
జమ్ముకశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్