బెంగళూరులో 33 గంటల లాక్‌డౌన్

బెంగళూరులో 33 గంటల లాక్‌డౌన్

కరోనా వైరస్ వ్యాప్తి గత కొన్ని వారాలుగా ఉధృతం కావడంతో రాష్ట్ర రాజధానితోపాటు పరిసర ప్రాంతాలలో 33 గంటల పాటు లాక్ డౌన్ విధిందాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు కఠిన ఆంక్షలతో 33 గంటల పాటు లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్ప ఆదేశాల మేరకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బిబిఎంపి) పరిధిలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు బిబిఎంపి కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో కేవలం నిత్యావసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై పోలీసులు చర్య తీసుకుంటారని ఆయన చెప్పారు.

వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి చేపట్టిన బహుముఖ వ్యూహంలో భాగంగా 33 గంటల లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితిని పర్యవేక్షించడానికి రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి కమిటీలు వేయాలని రాష్ట్ర కొవిడ్ 19 టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. వీటిలో బెంగళూరులో 8800 కమిటీలు ఉన్నాయి.

టాస్క్ ఫోర్స్ కమిటీలలో రాష్ట్ర ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, స్థానిక మునిసిపాలిటీ లేదా పంచాయతీకి చెందిన ఒక్కో సభ్యుడితో పాటు వాలంటీర్లు ఉంటారు. 50 ఏళ్ల లోపు వయసు ఉన్న రోగుల హోమ్ ఐసోలేషన్ కాలాన్ని 14 నుంచి 17 రోజులకు పెంచడంతోపాటు వ్యాధి లక్షణాలు బయటపడని కరోనా రోగుల హోమ్ ఐసోలేషన్‌కు కొత్త మార్గదర్శకాలను టాస్క్ ఫోర్స్ జారీచేసింది.