మార్స్ ఆర్బిటార్ నుండి అరుదైన చంద్రుడి చిత్రాలు 

భారత అంత‌రిక్ష సంస్థ ‌(ఇస్రో)కు చెందిన మార్స్ ఆర్బిటార్ అరుదైన చిత్రాల‌ను తీసింది.  ఆ ఆర్బిటార్‌లో ఉన్న మార్స్ క‌ల‌ర్ కెమెరాకు.. చంద్రుడు చిక్కాడు.  మార్స్ గ్ర‌హానికి అత్యంత స‌మీపంగా, అత్యంత పెద్ద‌గా ఉన్న ఫోబ‌స్ చంద్రుడి ఫోటోల‌ను మార్స్ ఆర్బిటార్ పంపిన‌ట్ల ఇస్రో వెల్ల‌డించింది.
జూలై ఒక‌ట‌వ తేదీ ఈ చిత్రాల‌ను మార్స్ ఆర్బిటార్ తీసింది. అంగార‌క గ్ర‌హానికి సుమారు 4200 కిలోమీట‌ర్ల దూరంలో ఫోబ‌స్ చంద్రుడు ఉన్న‌ట్లు గుర్తించారు.  మార్స్ ఆర్బిటార్ ఆ  చంద్రుడిని సుమారు 7200 కిలోమీట‌ర్ల దూరం నుంచి చిత్రీక‌రించిన‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  210 మీట‌ర్ల రెజ‌ల్యూష‌న్ ఉన్న చిత్రాల‌ను రిలీజ్ చేశారు.  6 ఎంసీసీ ఫ్రేమ్స్ దృశ్యాల నుంచి ఈ చిత్రాల‌ను జ‌న‌రేట్ చేశారు.
క‌ల‌ర్ క‌ర‌క్ష‌న్ కూడా చేసిన‌ట్లు ఇస్రో చెప్పింది. ఫోబ‌స్ చంద్రుడు ఎక్కువ శాతం కార్బ‌న్ మూల‌కాల‌తో ఉన్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.  ఫోబ‌స్‌లో భారీ లోయ‌ల్ని కూడా గుర్తించారు. స్టిక్‌నే క్రాట‌ర్‌తో పాటు సాక్లోస్కీ, రోచ్‌, గ్రిల్‌డ్రిగ్ లాంటి అగాధాల‌ను మార్స్ ఆర్బిటార్ ప‌సిక‌ట్టిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.
మంగ‌ళ‌యాన్ మిష‌న్‌లో భాగంగా మార్స్ ఆర్బిటార్‌ను నింగిలోకి పంపారు.  ఆర్నెళ్ల కాలం కోసం ఈ ప్రాజెక్టును చేప‌ట్టారు. కానీ మంగ‌ళ‌యాన్ చాలా ఏళ్లు కొన‌సాగే ఇంధ‌న దాంట్లో ఉన్న‌ట్లు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 2014, సెప్టెంబ‌ర్ 24వ తేదీన  మంగ‌ళ‌యాన్‌కు చెందిన మార్స్ ఆర్బిటార్ మిష‌న్‌ను అత్యంత విజ‌య‌వంతంగా క‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టారు.
ఏపీలోని శ్రీహ‌రికోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్‌లో మంగ‌ళ‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను 2013, న‌వంబ‌ర్ 5న‌ ప్ర‌యోగించారు.  అంగార‌క గ్ర‌హ అధ్య‌య‌నం కోసం సుమారు 450 కోట్ల‌తో మామ్ ప్రాజెక్టును చేప‌ట్టారు.  డిసెంబ‌ర్ 1, 2013లో భూగ్ర‌హ గురుత్వాక‌ర్ష‌ణ నుంచి మామ్ త‌ప్పించుకున్న‌ది. 
 
మార్స్ ఆర్బిటార్‌లో లైమ‌న్ ఆల్ఫా ఫోటోమీట‌ర్‌(ఎల్ఏపీ), మీథేన్ సెన్సార్ ఫ‌ర్ మార్స్‌(ఎంఎస్ఎం), మార్స్ ఎక్సోఫెరిక్ న్యూట్ర‌ల్ కాంపోజిష‌న్ అనలైజ‌ర్‌(ఎంఈఎన్‌సీఏ), మార్స్ క‌ల‌ర్ కెమెరా(ఎంసీసీ), థ‌ర్మ‌ల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్టోమీట‌ర్‌(టీఐఎస్‌) లాంటి  కీల‌క‌మైన ప‌రిక‌రాలు ఆర్బిటార్‌లో ఉన్నాయి.