సామ్రాజ్య విస్తరణ యుగం ముగిసిందని, ఇప్పుడు అభివృద్ధి యుగంలో ఉన్నామని చెబుతూ సామ్రాజ్యకాంక్ష ఉన్న దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయని, అలాంటి దేశాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు చెప్పకుండా చైనాను గట్టిగా హెచ్చరించారు.
చైనాతో ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని సమీక్షించేందుకు లడక్ ఉమ్మడి రాజధాని లెహ్‌లో ప్రధాని మోదీ శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపిన సందర్భంగా లడక్‌లోని నీమూలో సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ ధైర్యవంతులే శాంతి కోరుకుంటారని స్పష్టం చేశారు.
వీరత్వంతోనే శాంతి సాధ్యం అవుతుందని పేర్కొంటూ శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకొని కూర్చోబోమని పరోక్షంగా చైనాకు చురకలు అంటించారు. బలహీనంగా ఉన్నవారెప్పుడూ శాంతిని కాంక్షించరని తేల్చి చెబుతూ సామ్రాజ్య విస్తరణ యుగం ముగిసినదని పేరు చెప్పకుండా చైనాను హెచ్చరించారు.
గత నెల గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ ”మీ ధైర్య సాహసాలు అజరామరం. దేశ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతోంది. మీ త్యాగాలే దేశాన్ని నడిపిస్తున్నాయి. భారత శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పారు. లడఖ్ నుంచి కార్గిల్ వరకూ మీ ధైర్యం అమోఘం. ప్రతి పోరాటంలో మనదే విజయం” అంటూ ప్రధాని ప్రశంసించారు.
మన సైనిక బలగాలు నిరుపమాన సాహసాలు ప్రదర్శిస్తూ ప్రపంచానికి భారత్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. శాంతిపై భారత్‌కు ఉన్న నిబద్ధత ప్రపంచమంతా గమనించిందని తెలిపారు. ప్రపంచ యుద్ధాల సమయంలోనైనా, శాంతి సమయంలోనైనా, అవసరం వచ్చినప్పుడు మన సైనికుల ధైర్యాన్ని ప్రపంచం చూసిందని గుర్తు చేశారు.
దేశం కోసం గాల్వాన్ లోయలో ప్రాణాలర్పించిన అమర జవానులకు మరోసారి ఘన నివాళులు తెలుపుతూ సైనికుల సాహసం వారు విధులు నిర్వహిస్తున్న ఎత్తైన ప్రాంతాల కంటే సమున్నతమని మోదీ కొనియాడారు. సైనికుల సాహసాలు, చూపుతున్న శౌర్యప్రతాపాలతో స్వయం సమృద్ధ భారత్ మరింత పటిష్టమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
14కార్ప్స్ దళాలు చూపిన తెగువను ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారని చెబుతూ మీరు ప్రదర్శించిన ధైర్యసాహాసాలు ప్రతి ఒకరి ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయని ప్రధాని తెలిపారు. మీలోని అగ్నిని, ఆవేశాన్ని.. భారతమాత శత్రువులు చూశారని పేర్కొన్నారు.
ఇక్కడ తాను మహిళా సైనికుల్ని చూస్తున్నానని, కదనరంగంలో ఇలాంటి సందర్భం ప్రేరణను కలిగిస్తుందని, మీ వైభవం గురించే నేను మాట్లాడుతున్నానని సైనికులను ఉద్దేశించి మోదీ తెలిపారు.
సైనిక మౌళికసదుపాయాలపై వ్యయాన్ని సరిహద్దుల్లో మూడు రెట్లు పెంచామని చెప్పారు. లేహ్ నుంచి.. లడఖ్, సియాచిన్, కార్గిల్, గాల్వన్ సెలయేళ్ల నుంచి .. ప్రతి పర్వతం, ప్రతి కొండ.. భారతీయ సైనికుల సత్తాను చూసిందని కొనియాడారు.
More Stories
మిత్రుడు ట్రంప్ కు ప్రధాని మోదీ అభినందనలు
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు