ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జూన్ 30న జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనా విపత్తువేళ పేదలకు ఆహార ధాన్యాలను అందించి, వారిని ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజనను నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడాన్ని తెలంగాణ బిజెపి ఎంపీలు సోయం బాపూరావు, గరికపాటి మోహన్ రావు స్వాగతించారు.
 
పేద, అణగారిన వర్గాలకు మద్దతుగా నిలుస్తూ ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు తెలంగాణ పేద ప్రజల పక్షాన వారు మోదీ గారికి వారు ధన్యవాదాలు తెలిపారు. 80 కోట్ల మందికి 8 నెలల పాటు 5 కిలోల బియ్యం, కిలో పప్పు అందించే ఈ కార్యక్రమం  ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత కార్యక్రమంగా అభివర్ణించారు.
 
ఈ కష్టకాలంలో ఇది పేద ప్రజలకు గొప్ప భరోసానిస్తుందని పేర్కొన్నారు. రూ 1.7 లక్షల కోట్లతో పేదలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పేదలకు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. వారికి మరింత ఊరట కలిగించడానికి అదనపు నిధులను కేటాయించి మొత్తం రూ 90 వేల కోట్లను ఈ ఆహార భద్రత కోసం ఖర్చు పెట్టడం పేద ప్రజల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను రుజువు చేస్తుందని కొనియాడారు.
 
అత్యంత పేద ప్రజల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ లో కేటాయించిన రూ.60వేల కోట్లతో పాటు అదనంగా రూ.40వేల కోట్లు కేటాయించి పేదల పక్షపాతి అని నిరూపించుకున్నారని చెప్పారు. దీంతో పాటు వలస కార్మికుల ఉపాధి కోసమని నైపుణ్యాభివృద్ధికై (స్కిల్ డెవలప్మెంట్) ప్రత్యేక కార్యాచరణను ప్రకటించడాన్ని కొనియాడారు.
 
దేశం మొత్తం మీద చిరు, ఫుట్ పాత్ వ్యాపారులకు జూలై 1 నుండి ప్రత్యేక నిధిని కేటాయించి ప్రతి ఒక్క వ్యాపారికి కనీసం రూ.10,000 అందేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయంగా అభివర్ణించారు.