మళ్లీ గ్రేటర్ లో లాక్డౌన్ పై కేసీఆర్ వెనుకడుగు!

మళ్లీ గ్రేటర్ లో లాక్డౌన్ పై కేసీఆర్ వెనుకడుగు!
 
మళ్లీ హైదరాబాద్​లో పక్షం రోజుల పాటు నాలుగైదు రోజులలో లాక్​డౌన్  ప్రకటించడానికి సిద్ధంగా ఉండమని అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారా? జులై 2నే మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి   లాక్​డౌన్ పై ప్రకటన చేస్తారని కధనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎవ్వరు ఏమీ మాట్లాడటం లేదు. 
 
జూన్ 28న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ జరిపిన సమీక్షా సమావేశంలో గ్రేటర్  హైదరాబాద్​లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పాజిటివ్ కేసుల ఉధృతిని అడ్డుకోవచ్చని ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. లాక్ డౌన్ అంశంపై మూడునాలుగు రోజుల్లో మంత్రివర్గ సమావేశం జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 
 
అలా ప్రకటించి వారం కావస్తున్నా ఇంకా ఎలాంటి నిర్ణయం జరుగలేదు. అసలు లాక్ డౌన్ ఉంటుందా లేదా  అనే విషయం మంత్రులకు, ఉన్నతాధికారులకు కూడా తెలియడం లేదు. పైగా, ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని, లాక్ డౌన్ నిర్ణయం కోసం మంత్రివర్గం  ప్రత్యేకంగా భేటీ జరపాల్సిన పరిస్థితి లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. 
 
దేశవ్యాప్తంగా అన్ లాక్ 2.0 అమలవుతుంటే మళ్లీ లాక్ డౌన్ ఎందుకనే ప్రశ్నలు మంత్రులు కూడా వేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో కేసుల సంఖ్య పెరుతున్నదని గుర్తు చేస్తున్నారు. 
 
మరో వంక, గ్రేటర్​లో లాక్ డౌన్ విధిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆర్ధిక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాత పుంజుకుంటున్న ఆర్థిక పరిస్థితి మళ్లీ ​ లాక్​డౌన్​ పెడితే దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.  
 
ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వచ్చే రాబడిలో గ్రేటర్ నుంచే 50 శాతంకు పైగా వస్తుంది. జూన్​ నెలలో స్టేట్ ఓన్ టాక్స్ రూపంలో దాదాపు రూ 6 వేల కోట్ల రాబడి వచ్చింది. ఇందులో సగం గ్రేటర్ పరిధి నుంచే వచ్చింది.
 
మళ్లీ లాక్ డౌన్ ఉంటుందన్న వార్తలతో హైదరాబాద్​ సగం ఖాళీ అయిందని ప్రభుత్వ వర్గాలు అంచనాకు వచ్చాయి. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. బిజీగా ఉండే ప్రాంతాలు కూడా బోసిపోతున్నాయి. చాలా చోట్ల వ్యాపారస్తులు స్వచ్ఛంద  డౌన్ అమలు చేసుకుంటున్నారు. 
 
దీంతో నగరంలో ప్రజల కదలికలు తగ్గాయని సీఎం కేసీఆర్ కు ఆఫీసర్లునివేదించిన్నట్లు తెలిసింది.  ఇప్పటికే ఐటీ సంస్థలు వర్క్ ప్రం హోం అవకాశం ఇవ్వడంతో టెకీలు సొంతూళ్లలోనే ఉంటూ పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో మళ్ళి లాక్ డౌన్ విధించవలసిన అవసరం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.