పాక్ లో కృష్ణుడి గుడి నిర్మాణం ఆపాలని ఫత్వా 

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో శ్రీ కృష్ణుడి ఆలయం పనులు ప్రారంభమైన వారం రోజులకే వ్యతిరేకత మొదలైంది. గుడి కట్టడానికి ఇమ్రాన్ ఖాన్ సర్కారు రూ.10 కోట్లు సాయంచేస్తామని  ఇంతకుముందే ప్రకటించింది.   ఈమధ్యనే  భూమిపూజ కూడా జరిగింది.  

అయితే నిర్మాణ పనులు ఆపాలంటూ ఓ మతపరమైన సంస్థ ఫత్వా జారీ చేసింది. గుడి పనులు ఆపాలంటూ పాకిస్తాన్ కోర్టులోనూ పిటిషన్ వేశారు. 2018 ఎన్నికల్లో  గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ మైనారిటీలో మతపరమైన స్వేచ్ఛ కల్పిస్తామని హమీ ఇచ్చారు. పాకిస్తాన్ లో మైనారిటీల్లో హిందువులే ఎక్కువ.

ఎన్నికల్లో గెలిచిన ఏడాది తర్వాత ఇస్లామాబాద్ లో శ్రీ కృష్ణుడి ఆలయం నిర్మాణానికి భూమిని కూడా స్థానిక హిందు కమిటీకి బదిలీ చేశారు. గుడి నిర్మాణానికి  ఇస్లామాబాద్ క్యాపిటల్ డెవలప్ మెంట్ అథారిటీ అనుమతి ఇచ్చింది. దీనికి  రూ.10 కోట్లను ఇమ్రాన్ ఖాన్  సర్కార్​ మంజూరు చేశారు.

గత నెల 23న మానవహక్కుల  పార్లమెంటరీ కార్యదర్శి  లాల్ చంద్ మల్హి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇస్లాంలో ఆలయాల నిర్మాణానికి అనుమతి లేదంటూ లాహోర్ కు చెందిన జామియా అషర్ఫియా ఫత్వా జారీ చేసింది. దీనికి కొందరు ముఫ్తీలు, మతపెద్దలు మద్దతు చెప్పారు.

ఆలయ  నిర్మాణానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఇస్లామాబాద్ లో గుడి కట్టాలంటూ  హిందువులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు