ఆరోగ్యంగా ఉన్న వారిని కరోనా ఏమీ చేయలేదు 

కరోనా గురించి అంతగా భయపడాల్సిన పని లేదని, అత్యధికులపై దాని ప్రభావం ఉండబోదని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సునేత్ర గుప్తా భరోసా ఇచ్చారు.  తక్కువ వయస్సు ఉన్నవారిని, ఆరోగ్యంగా ఉన్న వారిని ఈ మహమ్మారి ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ఇన్‌ఫ్లూయెంజా తరహాలోనే కొవిడ్‌-19 మన జీవితాల్లో భాగమవుతుందని, సహజంగానే దానంతట అదే కనుమరుగవుతుందని పేర్కొన్నారు.
వైరస్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికే వ్యాక్సిన్‌ అవసరం ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్‌ గురించి ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇన్‌ఫ్లూయెంజాతో పోలిస్తే కరోనా కారణంగా నమోదయ్యే మరణాల సంఖ్య తక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
 
అందరినీ ఇది కబళిస్తుందని అనుకోవడానికి వీల్లేదని అంటూ , ఓ ఫ్లూ వంటి వ్యాధి గురించి ఎంతవరకూ భయపడుతామో అంతకు మించి భయాందోళనలు అవసరం లేదని చెప్పారు. అయితే శారీరక బలహీనత అంశం కూడా పరిగణనలోకి వస్తుందని సూచించారు. ప్రస్తుత తరుణంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ అవసరం ఉందని, అయితే ఇప్పుడు సాగుతున్న లాక్‌డౌన్ దీర్ఘకాలిక పరిష్కారం కాబోదని ఆమె స్పష్టం చేశారు.  
కాగా,  కొవిడ్‌ చికిత్సకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం కష్టమేమీ కాదని, వ్యాక్సిన్‌ను ఈ వేసవిలోపు (బ్రిటన్‌లో జూన్‌ నుంచి ఆగస్టు వరకు వేసవి కాలం ఉంటుంది) అభివృద్ధి చేస్తామని గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించడం, ముఖానికి మాస్కులను ధరించడం అవసరమని ఆమె సూచించారు. లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలు చేసిన కొన్ని దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి పెరుగుతున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఇలా ఉండగా, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా కొవిడ్‌-19 చికిత్సకు తాము అభివృద్ధి చేస్తున్న ChAdOx1 వ్యాక్సిన్‌ సురక్షితమైనదేనని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వెల్లడించింది. బ్రెజిల్‌లోని 5 వేల మంది వలంటీర్ల మీద మొదటి క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలయ్యాయని వర్సిటీ ప్రొఫెసర్‌ సారా గిల్‌బర్ట్‌ తెలిపారు.
 
ఈ వ్యాక్సిన్‌ అభివృద్ధికి ‘అడెనోవైరస్‌’ వైరస్‌ను ఉపయోగించినట్టు ఆమె పేర్కొన్నారు. అడెనోవైరస్‌ శరీరమంతటా విస్తరించే అవకాశం లేనందున రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా తమ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎలాంటి హానిని కలుగజేయదని, కాబట్టి వాళ్లు కూడా తమ వ్యాక్సిన్‌ను వాడొచ్చని చెప్పారు.