అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార రిపబ్లికన్‌లు, ప్రతిపక్ష డొమొక్రాట్‌లు ఎవరికివారే ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కీలకమైన భారత సంతతివారిని ఆకట్టుకోవడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు.
తాజాగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ భారతీయ ఐటీ ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తానని చెప్పారు. హెచ్–1బీ వీసాలపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తానని ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆన్‌లైన్ పద్ధతిలో జరిగిన ఓ టౌన్‌హాల్ సమావేశంలో బిడెన్ ఆసియన్ అమెరికన్‌లు, పసిఫిక్ ఐలాండర్‌లతో పలు అంశాలపై చర్చించారు. వివిధ దేశాల నుంచి ప్రైవేటు కంపెనీల వీసాలపై అమెరికాకు వచ్చిన నిపుణులు దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని, ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పగ్గాలు చేపడితే వంద రోజుల్లోనే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అధికారం చేపట్టిన తొలిరోజే ఇమిగ్రేషన్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్‌కు పంపిస్తానని చెప్పారు. దేశంలో తగిన పత్రాలులేని కోటీ పదిలక్షల మంది వలసదారులకు పౌరసత్వం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయిస్తానని బిడెన్ తెలిపారు. వారిలో సుమారుగా 17 లక్షల మంది ఏసియన్ అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్లు ఉంటారని చెప్పారు.
ముస్లింల ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు సుదీర్ఘమైన అమెరికా విలువల పునరుద్ధరణలో భాగంగా దేశంలోకి మళ్లీ శరణార్థులను తీసుకుంటామని ప్రకటించారు. గ్రీన్‌కార్డుల పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
అమెరికాలో భారత సంతతి వారు ఓటర్లలో 1 శాతంగా మాత్రవే ఉన్నప్పటికీ వారు కీలక రంగాలలో ఉండడం, ఎక్కువమంది సంపన్నులు కావడంతో వారి ప్రభావం ఇతరులపై విశేషంగా ఉంటుంది. భారత సంతతి వారిలో 70 శాతం మందికి పైగా గత పలు ఎన్నికలలో డెమోక్రాటిక్ అభ్యర్థులకే ఓట్లు వేస్తున్నారు.
ఈ మధ్య ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడని చెప్పడం, భారత పర్యటనలో భాగంగా గత ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించడం అంత కుడా భారత సంతతి ఓటర్లను దృష్టిలో ఉంచుకొనే కావడం గమనార్హం.
గత నెల చైనా సేనలు భారత సరిహద్దులో దురాక్రమణ ధోరణులు ప్రదర్శించిన సమయంలో భారత్ కు మద్దతుగా తమ సేనలు పంపుతామని అమెరికా ప్రమాదం సహితం రానున్న అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అని పలువురు భావిస్తున్నారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’